Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రశ్నలువేసింది. వచ్చిన అస్పష్ట సమాధానాలు ఆమెకేమీ అర్ధం కాలేదు. మళ్ళీ మళ్ళీ అడిగింది. అయినా జవాబులు అంతుపట్టలేదు. ఇంతలో ఆ అబ్బాయి అమ్మ రంగంలోకి ప్రవేశించింది. ఆమె అదే ప్రశ్నలు అడిగితే అబ్బాయి నుంచి జవాబులు వచ్చీరాకముందే పరిశోధకురాలు అర్ధం చేసుకోగల్గింది. దీన్నిబట్టి ఏమర్ధమవుతుంది? తల్లి భాష వేరు. పరిశోధకురాలి భాషవేరు. బిడ్డ తికమకపడింది పాపం!

తరగతి గది

ఇప్పుడు ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు వెలుస్తున్నాయి. కావల్సినంత పరిశోధన వాటిపై జరుగుతోంది. సామగ్రి తయారైంది. తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాఠశాలల్లోని వసతి గృహాల్లో తమ పిల్లల్ని చేర్చడానిక్కూడా సిద్ధపడుతున్నారు. టీచర్లకు ప్రత్యేక శిక్షణా కోర్సులు వచ్చాయి. అయితే మన స్కూళ్లల్లో కూడా అక్కడక్కడా ఇలాంటి పిల్లలుండొచ్చు. వీరినెలా చూడాలి అనే సమస్య మన ముందుకొస్తుంది.

తరగతి గదిలో కూడా ఇంతకు ముందు చెప్పుకొన్న పద్ధతులే పాటించాలి. ప్రతి బిడ్డనూ ఒక యూనిట్‌గా తీసుకొని. అప్పటిదాకా అతని ఇంట్లో పాటించిన పద్ధతుల్ని తెలుసుకొని నెమ్మదిగా దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది.

కొన్ని పదాల్ని ఎన్నుకోవాలి. అవి అమూర్తపదాలు కాకూడదు. వాటిని మాటి మాటికీ చెప్పించాలి. వాటి బొమ్మలు చూపాలి. ఆ బొమ్మలు వారికి పరిచితాలైనాక, వాటి పేర్లు చెప్పగలిగాక రాయడంలోకి వెళ్ళాలి. ఇవి కూడా చాలా చిన్న పదాలుగా మొదలవ్వాలి.

అలాగే మాట్లాడేందుకు సాధన చేయించడం కూడా స్కూలు పనే. శ్వాసతో సాధన, ఊదడం ద్వారా సాధన, నాలుకతో సాధన, పెదవులతో సాధన, ధ్వనుల్ని ఉత్పత్తి చెయ్యడంలో సాధన ఇలా పలు సాధనలు చేయించాలి.

ఒకే అచ్చుతో ముగిసే అక్షరాల్ని (రా, నా, పో) వుచ్చరింప చెయ్యడం ఒక మెట్టు. ఇలాంటి అక్షరాల్ని రెండేసి ఒకేసారి పలికించడం మరో మెట్టు (రారా, పోపో, నానా).

అలాగే ఈ పిల్లలు అక్షరాల్ని ఆధారం చేసుకొని పదాల్ని చదవరు. పదాల్ని మొత్తంగానే వారు చదువుతారు. ఒక దృశ్యం ఆధారంగానో, ఒక గుర్తుగానో వారు పదాన్ని పట్టుకొంటారు. చాలా సందర్భాల్లో ఆ పదాన్ని మరోచోట రాసినపుడు కూడా వారు చదవలేరు.

ఈ పిల్లల బోధనలో సాంప్రదాయక పఠనం కంటే పాటలకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రాసక్రీడలు మంచి ఫలితాన్నిస్తాయి. కథల్ని కూడా మనం ఇలా నేర్పడమే ఉత్తమ మార్గం. చూడ్డానికది ఎల్.కె.జి. పిల్లలకు చెప్పే పద్ధతిలాగా ఉండొచ్చు.

ఇలాంటి పాటల వల్ల కేవలం పదాల్ని గుర్తించడమేగాదు అవి బిడ్డ హృదయాన్ని చలింపచేస్తాయి. వీటిలో సంగీతం వాళ్ళని ఉత్తేజితుల్ని చేస్తుంది. మెదడులోని కుడి అర్ధగోళం దెబ్బతిని ఉంటే ఈ చలనం వుండదు. అది వేరే సంగతి.

ఇలాంటి మాతృభాషా బోధన ఈ పిల్లలకి ఏదో భాష నేర్పడం కోసం అనుకొంటే పొరపాటు. వీరి మానసిక వికాసానికి, ఆత్మస్థైర్యానికి ఇది అవసరం. ఇలా మాతృభాష ఈ పిల్లల అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.

ఆంగ్ల మూలం : SUGNATIFENN

తెలుగు అనువాదం : కె. మారుతిప్రసాద్, హరేసముద్రం

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 71