Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దృశ్య రూపాల్ని వాడుకోవడం మంచిది. బొమ్మల్ని చూపించి అందులో ఏముంది ఎవరు ఏం చేస్తున్నదీ చెప్పమనాలి. మనం సాయపడి చెప్పించాలి. అప్పుడు కూడా ఈ భాష పదాల్లో మాత్రమే ఉంటుందని మరిచి పోగూడదు.

నిద్రపుచ్చే ముందు దగ్గర పడుకో బెట్టుకొని ఒక పదాన్ని మాటిమాటికీ చెప్పించాలి. పిల్లలకు మంచి తీరికా, హాయి ఉన్నప్పుడు ఇలాంటి పదాలు చెప్పించాలి. అభినయం కూడా ఉపయోగపడుతుంది. ఒక పదాన్ని తల్లి అనునయించి చెప్పాలి. కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ పదాల్ని, విషయాల్ని చెప్పే ప్రయత్నం చెయ్యకూడదు.

ఇలాంటి పిల్లలకి పరభాష నేర్పే ప్రయత్నం చెయ్యకూడదు. మాతృభాషనే నేర్పాలి. అపార్టుమెంట్లలో ఉండే బహుభాషా వాతావరణం వీరిని ఇబ్బంది పెడుతుంది.

సామాన్యంగా పిల్లలు ఇంటిలో వాడే భాష వేరు. స్కూల్లో వాడే భాష వేరు. మాండలికాల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. గ్రామీణ పేద పిల్లలు చెప్పే పదాలు తరగతి గదుల్లో ఉండవు. ఇది కొత్త చిక్కులు తెస్తుంది. టీచర్లు దీన్ని గుర్తించి వ్యవహరించాలి.

ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక ప్రత్యేక పనిమనిషిని ఇలాంటి బిడ్డల కోసం నియమించుకోవడం మంచిది. తల్లిదండ్రులకు చాలా పనులుంటాయి. బిడ్డతో ఎక్కువ మాట్లాడ్డం, ఓపిగ్గా ప్రణాళికాబద్ధంగా మాట్లాడ్డం కష్టం కావచ్చు. అయితే పనిమనిషికి కొంత తర్ఫీదు వసరం.

ఇవన్నీ ఒక ఎత్తు. ఎప్పుడూ బిడ్డను ప్రోత్సహించడం, ఆదరించడం ఒక ఎత్తు. ఇలాంటి పిల్లలు సరిగా మాట్లాడలేరు. మనకు వారి భాష అర్ధం కాదు. కొత్తవాళ్లకి అసలే అర్ధం కాదు. అయినా తెలుసుకోవాలి. తెలిసినట్టు అన్పించాలి. ప్రోత్సహించాలి. ఈ పిల్లలు సులభంగా ఓడిపోయే స్వభావంతో ఉంటారు. బెరుకుతునం ఎక్కువ. భంగపడితే భయపడిపోతారు. మనం బెదిరించడం, మళ్ళీ మళ్ళీ చెప్పమనడం (అర్ధంకాక), అసహనం ప్రకటించడం, వెక్కిరించినట్టు కనపడడడం ఇవన్నీ ఈ పిల్లలకు చాలా పెద్ద సమస్య. మనకవి చాలా చిన్నవిగా అన్పించవచ్చు.

బయటి ప్రపంచం

ఒక ధనికుడికి ఒక కొడుకుండేవాడు. వాడు మానసిక వికలుడు. ఇది ఆ ధనికుడికి పెద్ద అవమానంగా ఉండేది. ఈ అవమానం కాస్తా ఆ బిడ్డ మీద వ్యతిరేకతగా కూడా మారింది. ఎవరైనా ఇంటికి వస్తే వాడిని ఒక గదిలో ఉంచేసేవారు. ఎవరి కంటా పడకుండా, ఎవరితో మాట్లాడనీకుండా జాగ్రత్తపడేవారు. ఫలితంగా వాడికి భాష ఏమాత్రం ఒంటబట్టలేదు. తల్లి పెద్ద క్షోభకు గురయ్యేది. చివరికి ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేక స్కూలు ఒకటి పెట్టారని తెలిసి అక్కడికి తీసుకొచ్చింది.

ఆ స్కూలు నిపుణులు ఆమెకేం చెప్పారో తెలుసా? “మీరు కార్లో బిడ్డను తీసుకొచ్చేపుడు కారు అద్దాలు దించండి. పరిసరాల్ని చూడనివ్వండి. ప్రదేశాల్ని గుర్తుపట్టనివ్వండి. సినిమాలకు, రైల్వేస్టేషన్లకు, బజార్లకు తీసుకెళ్ళండి. బంధువుల ఇళ్లకు పిలుచుకొని పొండి. పిల్లలతో మెలగనివ్వండి.” ఈ సలహా పాటించాక ఆ బిడ్డలో చాలా మార్పు వచ్చింది.

మరో సందర్భం ఏమంటే ఒక పరిశోధకురాలు ఒక మానసిక వైకల్యం గల అబ్బాయి దగ్గర కెళ్లింది. కొన్ని

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 70