Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానసిక వైకల్యం - మాతృభాషాభ్యసనం

మన మనస్సును స్వేచ్ఛగా ధారాళంగా వ్యక్తీకరించడంలో భాషకున్న ప్రాధాన్యత- అదీ మాతృభాషకున్న ప్రాధాన్యత దేనికీ ఉండదు. ఇతర చేష్టలు, ముఖకవళికలు ఎన్నయినా భాషముందు ఎందుకూ పనికిరావు. అలాంటి మాతృభాష పరిసరాల నుంచి మనకు చాలా సహజంగా అబ్బుతుంది. బిడ్డ మెదడు ఈ సామర్ధ్యాన్ని అద్భుతంగా కల్గి ఉంటుంది.

మరి మానసిక పరిణతి లేని వారి పరిస్థితి ఏమిటి? వీరి మనస్సు పరిసరాల భాషను అంత సమర్ధవంతంగా స్వీకరించలేదు. దీంతో అభివ్యక్తీకరణ లోనూ లోపం వస్తుంది. ఇది మళ్లీ బిడ్డ పెరుగుదలను పలు రూపాల్లో కుంటుపరుస్తుంది. ఫలితంగా తోటి పిల్లల ముందు భంగపడుతుంటారు.

మానసిక వైకల్యం గురించి ముందు మనం ఒకటి ఒప్పుకోవాలి. అదేమంటే మానసిక వైకల్యం అనేది ఒక జబ్బుగాదు. కేవలం అదొక అసౌకర్యం. దీన్ని అర్ధం చేసుకొని వీరికోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. 1954లోనే ఇలాంటి వారికోసం పాఠశాలలు తమిళనాడులో వెలువడ్డాయి.

ఇలాంటి స్కూళ్లు కొన్ని పద్ధతులు పాటిస్తున్నాయి. వీరు పాటిస్తున్న ప్రాథమిక నియమాలలో మొదటిది ఈ పిల్లలపట్ల స్నేహంగా ఉండటం. ఎప్పుడు ఏమి మాట్లాడినా ఆప్యాయంగా, వినోదాత్మకంగా మాట్లాడ్డం. ఇది వాళ్ల మనస్సుల మీద మంచి ప్రభావం కల్గిస్తుంది. ఇలాంటి మాటల్ని వాళ్లు బాగా ఇష్టపడతారు. తామూ అలా మాట్లాడాలని ప్రయత్నిస్తారు.

రెండోది ఈ వైకల్యం అందరిలోనూ ఒకే రీతిలో, ఒకే స్థాయిలో ఉండదు. దీన్నిబట్టి వీళ్లని విభజించు కోవాలి. 4-5 తరగతుల దాకా చదువుకోగలవారు చాలా మంది ఉంటారు. అయితే ఎక్కువ మందికి సహకారం అవసరం. ఎవరి మీదనో ఒకరి మీద వాళ్లు ఆధారపడక తప్పదు. ఆధారపడ్డం ఎంత అనేదాన్నిబట్టి వీరిని విభజించుకోవాల్సి ఉంటుంది.

ఒకస్థాయి వారు తమంత తామే క్రమంగా పరిసరాలకు బాగా అలవాటు పడతారు. దీన్ని ప్రోత్సహించాలి. అట్లని వీరిని స్వతంత్రంగా వదిలిపెట్టలేము.

భాష విషయానికి వస్తే మానసిక స్థాయి ఒకే విధంగా ఉన్నప్పటికీ భాషణా సమస్యలు భిన్నంగా

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 68