Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గులాబి పువ్వు ఆకుల మీద

సోడా మీద, బోర్డు మీదా

తాతగుండు మీద నీ పేరే రాస్తాను

తామర మీద, ముద్దబంతి మీద

కదలాడే కనురెప్పల మీద

మాటాడే పెదవుల మీద నీ పేరే రాస్తాను

చెప్పుల మీద, హృదయస్పందన మీద

వెన్నెల మీద, హృదయస్పందన మీద

వెన్నెల మీద, సూర్యకిరణాల మీద

అమ్మ తినిపించే పాల బువ్వ మీద

పువ్వుల మీద వాలిన తుమ్మెద రెక్కల మీద

ఆకాశంలో అందాలు వొలికించే జాబిల్లి మీద

తళతళలాడే నక్షత్రాల మీద నీ పేరే రాస్తాను

చిలక ముక్కు మీద

కోయిల పాట మీద

పాచిపళ్ళ మీద నీ పేరే రాస్తాను

గాండ్రించే సింహం మీద

ఘీంకరించే ఏనుగు తొండం మీద

పందిపిల్ల తోక మీద నీ పేరే రాస్తాను

నిగనిగలాడే నిమ్మకాయ మీద

కరెన్సీ నోటు మీద

దువ్వెన పళ్ళ మీద

పిట్టరెట్ట మీద నీ పేరే రాస్తాను

నారింజ కాయ మీద

బట్టతల మీద, చర్మం మీద

గడియారం ముల్లు మీద నీ పేరే రాస్తాను

కరెంటు తీగల మీద

కాలి బంతి మీద, చీమల కాళ్ల మీద

చెవిదుద్దుల మీద నీ పేరే రాస్తాను

అస్వాదిస్తే ఇందులో ఎంత మాధుర్యం లేదు? ‘చెవిదుద్దుల మీద' అనేది ఎంత మంచి పదం. ఈ పిల్లలే చెప్పకుంటే మన ‘దుద్దులు' కాలగర్భంలో కలిసిపోవూ?

'అమ్మ తినిపించే బువ్వ'లో ఎంత రుచి ఉంది. కోయిల పాట మీద ఎలా రాస్తారు? పందిపిల్ల తోక మీద రాయడమేమిటి? చీమకాళ్ల మీద ఎలా రాయాలనుకొన్నారు? ఒకరి చూపు తళతళలాడే నక్షత్రాల మీదికి పోతే మరొకరి బుద్ధి పాచిపళ్ల మీదికెందుకు వెళ్లినట్టు? గడియారం ముల్లుమీద రాయాలన్పించడం అద్భుతంగా లేదూ? పిట్ట రెట్ట మీద పాచిపళ్ళ మీద రాస్తానని చెప్పినందుకు నాకేమీ కోపం లేదు. అలా చెప్ప డానికి విసుగు కారణం కావచ్చు. కొంటెతనం కారణం కావచ్చు. పెద్ద పిల్లల తెలివిమీరినతనం కూడా కారణం కావచ్చు. నాక్కావల్సింది అదిగాదు. ఎంతమంది ఎంత అద్భుతంగా తమ హృదయం పెట్టారన్నది నాక్కావాలి. భాషా హృదయాన్ని ఎంత బాగా పట్టుకోగల్గారన్నది నాకు కావాలి. భాష నేర్పడం ఇలా ఉంటుంది మరి.

చదువు: ఇలానే చదవడం, రాయడం కూడా వస్తుందంటారా?

శివరాం: తప్పకుండా వస్తుంది. పిల్లలకి మనం చదివి వినిపించాలి. ఎంత వినిపిస్తే అంత మంచిది. పిల్లల్ని ఒళ్లో కూచో పెట్టుకుని చదివించాలి. ప్రతి రాత్రీ ఎలీనావాట్స్‌ని ఆమె కొడుకు కథ చెప్పమని మారాం చేస్తాడు. ఆవిడ చెపుతుంది. ఈ క్రమంలో పిల్లల్లో భావం క్రియేట్ అవుతుంది. మాంటిస్సోరి కూడా ఇదే అంటుంది. భాషను ఎమోషన్స్ నుంచే పెంచాలంటుందామె. ఆవిడ పరిశీలన ప్రకారం పిల్లలు అయిదేళ్లకే డిసైడ్ అయి పోతారు. పిల్లలది గ్రామర్ మైండ్ కాదు. వాళ్లది ఫోటో గ్రాఫిక్ మైండ్! అయిదేళ్ల తర్వాత ఇది లాజికల్‌గా మారుతుంది. అందువల్ల 5 సంవత్సరాలకు ముందు పిల్లల ఎన్ని భాషలైనా నేర్చుకొంటారు. మనం ఎత్తుకోగానే మొత్తుకోళ్లన్నట్టు రాయడం నేర్పడానికి పూనుకొంటున్నాం. ముందు వినికిడి నేర్పాలి. మనం లయ ఎప్పుడు నేర్పాం? కథలు ఎప్పుడు చెప్పాం? ఎపుడైనా మన పిల్లలు బుర్రకథ విన్నారా!

ఎలీనావాట్స్ తన కొడుక్కు బకాసురుడి కథ చెపుతూ, బకాసురుడిక్కావల్సిన ఆహార పదార్థాలు ప్రజలు ఏమేమి చేశారో చెపుతూ ఇడ్లీల్ని కూడా అందులో చేర్చుతుంది. వాళ్లబ్బాయి 'సాంబారు...' అంటాడు. ఇలా ఉంటుంది కథ చెప్పడమంటే.

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 58