పదకొండేళ్ళ పిల్లలతో ఓ డైలాగ్ !
టీచర్ టీచింగ్ పేరుతో పాఠాల్ని వల్లిస్తారు. పిల్లలూ అదే చేస్తారు. కొత్త టీచర్‌కు కూడా కొంత కాలానికి ఈ పాడిందే పాట అలవాటవుతుంది. జీవితం అంతా ఈ పాటతో గడిచిపోతుంది. టీచర్‌కిదొక భరోసా.
అలాగే పిల్లల్ని వినోదాలకి మరపడం అంటే నేర్చుకోవడం నుంచి పక్కదారి పట్టించడమే అవుతుంది. వినోదాల్ని మరిగిన వాళ్లు పిల్లలపైనా పెద్దలైనా దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. సీరియస్ వాతావరణం నుంచి వాళ్లు పారిపోతుంటారు. వినోదం వ్యసనంగా మారుతుంది వీళ్లకి. వ్యసనంలో ఏకాగ్రత ఎప్పుడూ ఉండదు. ఎరుక లోపిస్తే నేర్చుకోవడమూ ఉండదు.
టీచర్ పిల్లలకి వినోదం మప్పడం మానెయ్యాలి. వాళ్లు ఎలా నేర్చుకొంటున్నారు? వాళ్లతో కలిసి తాను ఎలా నేర్చుకోవాలి అనేదే ముఖ్యం కావాలి. జోక్స్ చెప్పడం, కథల్లో మైమరిపించడం ఇవన్నీ నేర్చుకోవడంలో భాగంగా ఉండాలిగానీ వ్యసనంగా మార్చగూడదు. నేర్చుకోవడంలోనే ప్రతిదాని ఉపయోగమూ దాగి ఉంటుంది.
పిల్లల్ని గమనించడం నుంచి టీచరు ఎంతో నేర్చుకొంటాడు. క్లాస్‌రూంను ఎప్పుడూ బోసిగా ఉంచగూడదు. పిల్లలు గమనించడానికి తగినట్టు అందులో ఏదో ఒకటి ఉండాలి. స్వతఃసిద్ధత, సద్యః స్ఫురణ టీచర్‌కి ఉండాలి. అట్లని టీచర్ ప్రిపేర్ కాకుండా క్లాసులోకి వెళ్లగూడదు. రాత్రి నిద్రపోయేటపుడు కూడా టీచర్ ప్రిపేర్ కావాలి. మళ్ళీ దాన్నంతా పిల్లల మీద రుద్దకూడదు. ముఖ్యంగా విషయాన్ని, సమాచారాన్ని, వివరాల్ని పిల్లల మీద రుద్దకూడదు.
ఒకరోజు మా తరగతి గదిలో ఏం జరిగిందో చూడండి.
పిల్లలందరూ జె. కె. సెంటర్‌కు వస్తున్నారు. లోపలికి వస్తుండగానే వాళ్లని గ్లాస్‌లో అమర్చబడ్డ పూలు ఆకర్షించాయి. అవి కాక్టస్ పూలు. పిల్లలు ఒక్కొక్కరూ ఆ పూలు వాసన చూశారు. వాటి అందానికి ముగ్ధులయ్యారు. ఆ పూలు ఎవ్వరికీ తెలీదు. టీచర్‌కి కూడా తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. మరి ప్రతి దానికీ ఒక పేరుండాలి గదా! పిల్లల్లో గుసగుసలు మొదలయ్యాయి.
'అవి కాక్టస్‌పూలు', 'కాదు మల్లెలు', 'కాదు సంపెంగలు’, ‘చూడండి ఆ వాసన. అవి ఆకాశ మల్లెలు'. ఇలా పిల్లలు ఆ పూలని ఎన్ని పేర్లతో పిలిచారో? అయితే ఆ పూలు ఈ పేర్లని వేటినీ పట్టించుకోలేదనుకోండి.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 52