పిల్లలు మాట్లాడ్డం నేర్చుకొన్నట్టే
రాయడమూ నేర్చుకోగలరా?
భాషా, లిపీ ఈ రెండింటి స్వభావం ఒకటేనా?పరిణామ వికాస క్రమాలు ఒకటేనా? అలా అయితే భాష నేర్చుకొన్నట్టే అక్షరాల్నీ పిల్లలు సహజంగా నేర్చుకొనే వీలుందా? రెండింటి అభ్యసనక్రమం సైతం ఒకటేనా?
ఈ ప్రశ్నలు కొంచెం లోతైనవి. 'పిల్లలు భాష (మాట్లాడ్డం) ఎలా నేర్చుకొంటారు' అన్న ప్రశ్నకు సందర్భం, స్వప్రమేయం, స్వీయావసరం, స్వేచ్ఛల ఆధారంగా నేర్చుకొంటారనీ దీన్నే 'సహజ అభ్యసన'మనీ ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు. మరి లిపికీ (అక్షరాలకూ) ఇది వర్తిస్తుందా అంటే 'అంతే' అని చెప్పడానికి మాత్రం వీళ్ళలో చాలామంది తటపటాయిస్తారు.
అసలు మనం మాట్లాడ్డం నేర్పడంలేదు. పిల్లలే తమకుతాము నేర్చుకొంటున్నారు. కానీ ఏమీ నేర్పకుండా 'రాయడం' నేర్చుకొనే వాళ్ళెవరున్నారు? కాబట్టి మాట్లాడ్డం రాయడం రెండూ ఒకేగాటన కట్టెయ్యదగినవి కావని ఎవరైనా తేలిగ్గా జవాబు చెప్పొచ్చు. మరికొంచెం లోతుగా చెప్పదల్చుకొంటే అసలు మాట్లాడ్డం ఒక తప్పనిసరి అవసరం. బిడ్డకి ఆకలి వేసినపుడు దాన్ని ఏడుపు రూపంలో వ్యక్తం చేస్తుంది. దీన్ని భాషకు ప్రాథమిక రూపంగా మనం అనుకొంటే ఇది మనుగడకు సంబంధించిన సమస్య. ఇలా చూస్తే భాష ఓ విధంగా ఒక సహజాతం లాంటిది. అందుకే దీన్ని వ్యక్తీకరించేందుకు సహజమైన ఏర్పాటు ఉంది. మన వాగ్యంత్రం ఇందులో భాగం. మరి లిపికీ స్వభావం ఎక్కడుంది? లిపి మనం అవసరం కొద్దీ కల్పించుకొన్నది. రాసేందుకు వాడే సాధనాలు నోరులాగా, నాలుకలాగా సహజమైనవి గావు. అవి మనం సృష్టించుకొన్నవి. అవి మనిషి బాహిరమైనవి.
అలాంటిపుడు భాష నేర్చుకొన్నట్టే పిల్లలు లిపిని ఎలా నేర్చుకోగలరు? దీనికి 'నేర్పడం' తప్పనిసరి. ఒక క్రమంలో నేర్పడం మరింత తప్పనిసరి. ఈ రకమైన చర్చ ముందుకొస్తుంది.
అక్షరాల స్వభావం
దీన్ని తేల్చుకోవాలంటే లిపి స్వభావంలోకి మనం వెళ్ళాలి. దాని లక్షణాల్ని కొంచెం పరిశీలించాలి.
మొదటిది - మనం పెట్టుకొన్న పేరుకీ, ఆ వస్తువుకీ ఎలా సంబంధం లేదో మనం రాస్తున్న అక్షరానికీ పలుకుతున్న ధ్వనికీ సైతం సంబంధం లేదు. గాడిదను గాడిద అనే ఎందుకనాలో చెప్పలేనట్టే ఒకానొక కంఠధ్వనికి 'క' అనే ఎందుకు రాయాలో కూడా మనం చెప్పలేము. 'గాడిద' లాగే 'క' కూడా మనం పెట్టుకొన్న ఓ సంకేతం. అమూర్త సంకేతం.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 35