Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాన్వెంట్లలోనూ, ఒకే గదిలో ఐదు తరగతులతో కుస్తీ పట్టే ప్రభుత్వ బళ్ళోనూ పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలంటే ఎండమావుల్లో నీళ్ళు వెతుక్కోవడం లాంటిదవుతుంది.

శతకకారుడు పేర్కొన్నట్లు నొప్పించకుండా తప్పించుకు తిరగడమే జీవితాన్ని జయించడమైతే ఆ దిశగా మన బడులు పిల్లలకి ఎంతమాత్రం శిక్షణ ఇస్తున్నాయి? అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా రేపటి పౌరుల కోసం గైడెన్స్, కౌన్సెలింగ్ సెంటర్లు మనకెక్కడివి. మన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉండే సంబంధాలు పిల్లల వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ఏ మేరకు ఉపయోగపడతాయో ఆలోచించాల్సిందే. బెర్నాడ్‌షా పేర్కొన్నట్లు మాటతీరు మనిషి నడవడిని తెలియజేస్తుంది. కాబట్టి ఆ సామర్థ్యాన్ని అలవరచడం బడి చదువులో భాగంగానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విచిత్రం ఏమంటే మన చదువులు మొగలుల పరిపాలనా విధానమెట్టిదో నేర్చుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యతను మనిషిగా మనుషుల్తో మెలగడ మెలాగో నేర్పడానికి ఇవ్వడానికి సాహసించవు. జీవితానికి సంబంధించని అంశాలతో వీధిబడి నుండి యూనివర్సిటీ దాకా సాగుతున్నాయి.

పిల్లలు బడి మానివేయడానికి (ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో) అనేకానేక కారణాలున్నప్పటికీ ప్రధాన కారణం వాళ్ళ సామర్థ్యానికి, భావాలకు, అనుభూతులకు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత లేకపోవడం అనేది చాలా పరిశోధనల సారాంశం. ఎన్ని ఎక్కువ పుస్తకాలుంటే ఎంత ఎక్కువ హెూమ్‌వర్క్ ఇస్తే, ఎంత తక్కువ సమయం ఇంట్లో ఉండేలా చూస్తే అదే అద్భుతమైన చదువుగా, ఖచ్చితమైన బడగా చదువరులైన తల్లిదండ్రులు, సూడో మేధావులు ఆలోచిస్తున్న రోజులివి. ఇక బడుగు బతుకుల ఆలోచనల్లో బడికి చోటెంత ఉంటుందో మన కందరికీ తెలిసిందే. సహజంగా చైతన్య వంతులైన పిల్లలు బందిఖానాలాంటి బడి విధానాల వల్ల బండబారిపోకుండా చూడాలి. పిల్లలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించాలంటే

తరగతి గదిలో పాఠ్యాంశాలపై చర్చలు నిర్వహించాలి.
పరిష్కారాలు సూచించమనాలి.
అసంపూర్తి కథలు పూర్తిచేయమనాలి.
నువ్వైతే ఏం చేస్తావు? అని అడగాలి.
కథలు పాటలు చెప్పించాలి.
తాము చూసిన సినిమా గురించి చెప్పమనాలి.

సెలవుదినం తర్వాత రోజు టీచరు పిల్లల్తో కలిసి కూర్చొని సెలవుదినాన ఏమేమి చేశారో మాట్లాడుకోవాలి.

ఇలా ఎన్నో సందర్భాలు సృష్టించుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే పిల్లలు మాట్లాడేటపుడూ, రాసేటపుడూ అప్పటికప్పుడే భాషాదోషాలు సవరించే ప్రయత్నం చేయకూడదు. ఇది వారి ఆలోచనా స్రవంతికి అవాంతరమవుతుంది.

మాట్లాడటమే చర్చ. చర్చ ప్రశ్నించడానికి దారి తీస్తుంది. ప్రశ్న చైతన్యానికి ప్రతీక. కాబట్టి మానవ సంఘ జీవనానికి మూలస్తంభమైన చైతన్యం వెల్లి విరియాలంటే పిల్లలు స్వేచ్ఛగా నోరువిప్పి మాట్లాడగలగాలి. ప్రశ్నించగలగాలి. ఆ దిశగా మన బళ్ళు, చదువులు కళ్ళు తెరవాలని ఆశిద్దాం. అప్పుడే తరగతి గదులే రేపటి తరగని నిధులవుతాయి.

- టి.వి.ఎస్. రమేష్‌

నెల్లూరు

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 34