Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారాంశం. ఇలా నేర్చుకొనేపుడు తప్పులు వెతికే ప్రశ్న వుండదు. పాల్గొంటూ పోతూ ఉంటే తప్పులు తమంత తాము తెలిసివస్తాయి.

దీన్ని మన క్లాసురూంలోకి తేవడమంటే ఏమిటి? మన బడి గోడలకు పిల్లలకు అర్థమయ్యే ఆసక్తి కలిగించే వాక్యాలు, పాటలు, బొమ్మల పేర్లు ఇంకా, ఇంకా ఎన్నైనా తగిలించవచ్చు, రాయించవచ్చు. (అర్థంకాని సంస్కృత సూక్తులుకాదు సుమా.) పిల్లలకి పుస్తకాలు ఇవ్వవచ్చు. వాటిని వాళ్ళిష్టం వచ్చినట్టు చూచుకొనే ఏర్పాటు చెయ్యవచ్చు. ఫ్లాష్‌కార్డులు అందుబాటులో వుంచవచ్చు. పెద్దగా చదివి విన్పించే వాటినే పుస్తకాల్లో చూడమని చెప్పవచ్చు. ఇది ఎంత ఎక్కువగా జరిగితే, ఇలాంటి సామగ్రి ఎంత ఎక్కువగా ఉంటే చదవడం అంత సులభంగా త్వరగా వస్తుంది.

ఈ కాలంలో ఇదేమంత పెద్ద సమస్య కాదు.

ఈ కోణం నుంచి చూచినప్పుడు మన వాచకాల పాత్ర ఏమిటో తెలుస్తుంది. వాటిలో ఉన్నదంతా అత్యంత కృత్రిమ భాష. కొన్ని గుణింతాల్ని, అక్షరాల్ని పరిచయం చెయ్యడం కోసం అల్లిన వాక్యాలివి. వాటికి అర్థంపర్థం ఏమీ ఉండదు. అవి పిల్లలవి కాదు. మనం వండిపెట్టిన కృత్రిమ వంటకమది. ఇటీవల హిందీ వాచకాలపై జరిగిన ఒక పరిశీలన ఈ వాచకాల్లోని వాక్యాలు ఎంత వికారంగా ఉన్నాయో తేటతెల్లం చేసింది (డా॥ శోభా సిన్హా ).

రెండోది వాచకాలు తప్ప మన పిల్లలు చదవడానికి ఇంకేమీ లేకపోవడం. పిల్లల్ని దృష్టిలో ఉంచుకొనిమరీ ఒకటి రెండు మూడు తరగతుల పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని రాసిన పిల్లల పుస్తకాలు మనకు లేవు. పిల్లల పుస్తకాలంటే భాష అంతా వచ్చాక దాన్ని నిలబెట్టుకోడానికి అవసరమయ్యేవి అని తప్ప ప్రాథమిక దశలో భాషను నేర్చుకోడానికి ఉపకరించేవి అనే అర్థంలో మనం బాలసాహిత్యాన్ని చూడలేదు. అలాంటి గ్రంథాలయాల్ని మనం రూపొందించుకోలేదు. అయితే ఉన్నంతలో సగటు టీచరు రూ. 500-600 ఖర్చు పెడితే వీటిని సంపాదించుకోవచ్చు. తెలుగులో తొలి ప్రయత్నం ఇప్పుడే మొదలైంది. ఉన్న పుస్తకాల్ని కూడా వాడకుండా (చించేస్తారని) పెట్టెలో పెట్టి తాళం వెయ్యడమంటారా! అది మన భావదారిద్ర్యానికి పరాకాష్ట.

మనం పలకా బలపం పట్టించి, దిద్దించి, తప్పుల్ని సరిచేసి మళ్ళీ మళ్ళీ దిద్దించేందుకు పడే శ్రమ పిల్లలకి పుస్తకాలిచ్చి, పెద్దగా మనం చదివి, పరిచయం చేసి పిల్లల మాటల్ని, పాటల్ని బోర్డు మీద రాసి, చెప్పించి, పలు రూపాల్లో పిల్లల్ని భాషా ప్రపంచంలోకి నెట్టడం కోసం ఉపయోగిస్తే పిల్లలు ఆనందం అనుభవిస్తారు. భాషనూ నేర్చుకొంటారు.

ఇంకో అంశం బొమ్మలెయ్యడం. బొమ్మలు వెయ్యడమంటే ఏదో కళాతృష్ణను తీర్చుకోవడమని మన అభిప్రాయం. పిల్లలు లిఖిత ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఇలానే మొదలవుతుంది. 'తమ ఆలోచనల్ని, ఊహల్ని పిల్లలు బొమ్మల్లో రాస్తారు. ప్రారంభ లేఖనం బొమ్మలతోనే మొదలవుతుంది,' అని మనం గుర్తిస్తే పిల్లల్ని ఇష్టమొచ్చినట్లు బొమ్మలు వేసుకోవడానికి అనుమతిస్తాం. ఏర్పాటు చేస్తాం. ఆ బొమ్మలు ఏం చేస్తున్నాయో పిల్లలు రాస్తారు. మొదట బొమ్మ రూపంలో వ్యక్తమైన ఊహ, తర్వాత అక్షర రూపంలో వ్యాఖ్యానింప బడుతుంది.

దీనిపైన సైతం కావల్సినంత పరిశోధన జరిగింది.

పై మూడు అంశాల్లో అంతర్లీనంగా మరొక అంశం దాగి ఉంది. అది పిల్లలు తమ అనుభవాల్ని, ఊహల్ని మనతో పంచుకోవడం, ఒక పరస్పరాదాన ప్రదాన కార్యక్రమం. ఇక్కడ పిల్లలు తమను తాము వ్యక్తం చేసుకొంటారు. వ్యక్తం చేసుకొనే క్రమంలో నేర్చుకొంటారు. భాషలోని పఠన, లేఖన నైపుణ్యాల్ని కూడా నేర్చుకొంటారు.

ఈ అభ్యసనానికి సజీవత్వం ఉంటుంది. హృదయం ఉంటుంది. ఇందులో ఆవేశం, లయా ఉంటాయి. మనిషి భాష ద్వారా వ్యక్తమయ్యేది ఈ రూపంలోనే. మనిషి సార్థకతా, భాష సార్థకతా ఇమిడి ఉండేది ఇందులోనే.

ఈ క్రమంలో టీచర్లంగా మనమూ చాలా నేర్చుకొంటాం. ఈ నేర్చుకోడంలో ముఖ్యమైంది మనం పిల్లల కంటే చాలా గొప్పవాళ్ళం ఏమీ కాదనేది. వాళ్ళ సామర్థ్యం అఖండమైనదనేది రెండవది. అసలైన బోధన ఎంత తియ్యగా ఉంటుందో అర్థం కావడం మూడవది.

ఇంత చెప్పుకొచ్చాక బుడిబుడి బుడతలు బడిలోకి అడుగుపెట్టగానే మనం ఏం చెయ్యాలి అనేది మళ్ళీ చెప్పాలంటారా!

- వి. బాలసుబ్రహ్మణ్యం

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 21