పిల్లలూ - భాషా
మానవ నాగరికతను మలుపు తిప్పింది భాష అని మనకు తెలుసు. భాష మానవుడి ప్రమేయాన్ని బయటి ప్రపంచంలో విప్లవీకరించడమే గాదు మానవుణ్ణి అంతర్గతంగా కూడా విప్లవీకరించింది. వానరుడి నుండి నరావతారం జరిగాక నరుడిలోని అనేక మార్పులకు భాష ఒక కారణమని ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం. అప్పటిదాకా బయటి శక్తులు పరిణామక్రమాన్ని నిర్ణయిస్తే భాష పుట్టాక అంతర్గతశక్తి (భాష) పరిణామాన్ని నిర్దేశించిందన్నమాట.
ఇప్పుడు భాష సార్వత్రికం. సార్వజనీనం. లిపిలేని భాషలున్నైగానీ ధ్వనుల్లేని, మాటల్లేని భాషలిపుడు లేవు. అత్యంత ప్రాథమికస్థాయి భాష సైతం అద్భుతంగా ఆయా జాతుల అవసరాల్ని తీర్చగల స్థాయిలో ఉంది. అలాగే అవసరాలు పెరిగే కొద్దీ భాష తనకుతాను అద్భుతంగా మార్పులకు లోనవుతుంది. ఎప్పటికప్పుడు జవసత్వాలు సమకూర్చుకొంటోంది. భాషా, మానవుడూ చెట్టాపట్టాలేసుకొని పాతాళపు పొరల్నీ, గగనాంతరాళాల్నీ పిడికిట్లో బిగించుకొంటున్న యుగం మనది.
భాషా నిర్మాణం
మనమందరం మాట్లాడుతున్నాం. అలవోకగా మాట్లాడుతున్నాం. మాట్లాడ్డమంత సులభం మరేముంది గనక? కానీ కొంచెం లోతుగా చూస్తే భాషకు ఎన్ని కట్టుబాట్లు! ఎన్ని నిబంధనలు! అసలు భాష ఎంత సంక్లిష్టం!!
అలాగే భాషకున్న ఈ ప్రాథమిక నిబంధనలన్నీ సార్వత్రికాలు. అన్ని భాషలకూ సమానంగా వర్తించేవి. ప్రతి భాషలోనూ హల్లు- అచ్చు- హల్లు- అచ్చు (CVCV) పద్ధతే ఉంటుంది. హల్లుల్ని అచ్చుల్లేకుండా పలకలేము. ఒకవేళ పలికినా రెండుమూడు హల్లులకు మించి ఒకటిగా పలకలేము. మూడు హల్లుల సంయుక్తాక్షరాలు గల పదాలు ఏ భాషలోనైనా పట్టుమని పది చెప్పండి చూద్దాం. స్త్రీ శాస్త్రం, స్ట్రీట్, స్ట్రక్చర్ ఇలా చెప్పొచ్చు. ఎంతచెప్పినా STR ధ్వనులతో తప్ప ఇతర ధ్వనులు (హల్లులు) గల సంయుక్తాక్షరాలు ఎక్కడా చిక్కవు. ఇక నాల్గు హల్లులు గల సంయుక్తాక్షరం అసాధ్యం.
మన వాగ్యంత్రం ఎక్కువ హల్లుల కలయికను అంగీకరించదు. అందుకే మనం 'ఇస్కూలు' అంటాం. సూర్యుణ్ణి సూరీడు అని సరిపెట్టుకొంటాం.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 13