Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి ఏం మాట్లాడుకొంటున్నారో రికార్డు చేశామనుకోండి. అందులోని పదాలన్నీ క్రోడీకరించి, మన పదాలతో పోల్చి చూచామనుకోండి. మనకు నన్నయ భాష ఎలా ఉంటుందో పిల్లలకి మన భాషా అలానే అన్పించి ఉంటుందని అర్థంగాదూ.

మరో సంగతి - భాషకు అర్థం గావడమొక్కటే పరమార్థం గాదు. అది ఆత్మీయంగానూ ఉండాలి. అప్పుడే మనం ఎదుటవాళ్ళతో మమైకమవుతాం. మన హృదయాన్ని విప్పుతాం. పదాలు చాలా సామాన్యమైనవే తీసుకోండి. ‘పాఠశాల, పరిసరాలు' లాంటివి సైతం ఎంత పరాయి పదాలో అట్టే మనకు తెలిసిపోతుంది. విచిత్రం ఏమంటే మనం కూడా ఈ పదాల్లేకుండానే ఎక్కువ విషయాలు మాట్లాడుకొంటాం. పిల్లలూ వీటికి తమవైన స్వంత పదాలు ఎంచుకొనే ఉంటారు. 'మా బడికీ రోజు సెలవం'టారుగానీ, 'మా పాఠశాలకు సెలవ'ని ఆంధ్రదేశంలోని ఏ ఒక్క పిల్లాడైనా అంటారా? మనమైనా అంటామా?

భాషా సంస్కరణోద్యమ తాపత్రయం

పిల్లల భాషను సంస్కరించాలని మనకు మహా తాపత్రయం. ‘వాళ్ళు తప్పులు మాట్లాడతారు. మంచిగా మాట్లాడరు. చదువుకొన్నవాళ్ళ మాటలు వాళ్ళకి రావాలి. మరీ పేదపిల్లల యాస ఘోరంగా ఉంటుంది. అంతా అనాగరికం. ఇవన్నీ సరిచేసి 'శుద్ధభాష'ను నేర్పడానికే గదా బడి ఉండేది,' అని మన దృఢమైన విశ్వాసం.

పసిబిడ్డలు 'బడికి పోతా' అనకుండా 'బలికి పోతా' అనే అంటారు. దాన్ని సంస్కారహైన్యం అని మనమనడం లేదు. 'బలికి' అన్నపుడే చెంపలు వాయించి వుంటే, ప్రతి వాక్యాన్నీ వ్యారణాంశాలు వెతికి వెతికి సరిచేసి ఉంటే అందరూ మూగమొద్దులయ్యేవారు. మనం ముందు ధారాళంగా, స్వేచ్ఛగా మాట్లాడనిస్తున్నాం. ప్రోత్సహిస్తున్నాం. సమాజంలో పెరిగే కొద్దీ, పాల్గొనేకొద్దీ ఏది తప్పో, ఏది ఒప్పో పిల్లలే తెలుసుకొంటున్నారు. మన బడీ అంతే. మనతో మాట్లాడితే గదా పిల్లలకి భాష రావడం! ఇక 'సంస్కారం' 'నాగరికత' 'సంస్కృతి' అంటారా? ఎవరి సంస్కారాలు వారివి. ఎవరి భాష వారిది. వాటితో తమ అవసరాలు వాళ్ళు అద్భుతంగా తీర్చుకొంటున్నారు. బతుకుతున్నారు. అదీ ఒక బతుకేనా అని మనం అనొచ్చు. మరి మనలా వాళ్ళు పెట్టి పుట్టలేదే! దీన్ని గుర్తించడం మంచిది. భాష సామాజికమైంది. సాంస్కృతికమైంది. కంఠస్తం చేసి ఒంటబట్టించుకొనేది కాదు. మన పిల్లలు నిరుపేదల పిల్లలు. తరతరాల మానవ సంస్కృతికి వాళ్ళు వారసులు.

ఈ పిల్లల్ని ప్రేమించడమంటే వాళ్ళ సామాజిక పునాదినీ ప్రేమించడమే.

మన పుస్తకాల్లో వాళ్ళ ప్రపంచపు భాష ఉండదు. కనీసం మనం రాసే బడి గోడల మీది నినాదాల్లో కూడా వాళ్ళ విషయాలు, మాటలు ఉండవు. అంతా పరాయీ కరణ! ఇక దొరికింది ఒకే మార్గం. పిల్లల్లో పిల్లలు మాట్లాడుకోవడం. దానికీ మనం నిషేధాలు విధిస్తే ఎలా?

దీనికో చక్కని చిట్కా, గ్రూపులుగా చేసి చదువు నేర్పడం. ఇలా చేస్తే మన పాఠాన్ని గురించి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొంటారు. వాళ్ళ భాషలో చర్చించుకొంటారు. వాళ్ళ సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో విశ్లేషించుకొంటారు. విషయం పరాయిదైనా స్వాయత్తం చేసుకొంటారు.

స్వంతభాషలో ఆత్మీయత ఉందనుకొన్నాం. ఆత్మీయత కేవలం భాష ద్వారానే వ్యక్తం చెయ్యలేము. పిల్లల్తో కలిసి మనం ఆడితే, పాడితే, అభినయిస్తే, కృత్యాలు చేస్తే, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే అప్పుడు అత్యంత సహజంగానే వాళ్ళ భాషలో మనం మాట్లాడతాం. వాళ్ళు మనతో మాట్లాడతారు. పిల్లల పదాల లిస్టులు కంఠస్తం చేసినంత మాత్రాన మనం పిల్లల భాషలో మాట్లాడలేం.

ఇక్కడ మనకు మరో చిక్కు ఉంది. పిల్లల్ని మాట్లాడనిస్తే అడ్డ ప్రశ్నలు వేస్తారు. అడ్డదిడ్డపు జవాబులు చెపుతారు. మనల్ని నిలేస్తారు. 'విసిగిస్తారు' కూడా. ఇలా మన 'పెద్దరికం' మనల్ని వెంటాడుతుంటుంది. దీన్నించి బయటపడాలి. ‘మాట్లాడ్డం' అనే మాటలో 'మాట్లాడ నివ్వడం' అనే అర్థమూ ఇమిడి ఉంది. వినడమూ అంతర్భాగమై ఉంది. భిన్నాభిప్రాయాలు, విరుద్ధాంశాలూ వ్యక్తంగావచ్చు. ఈ ఘర్షణ నుంచే జ్ఞానం వికసిస్తుంది. ఈ క్రమాన్ని మనం ఒప్పుకొంటే అసలు సమస్యే వుండదు. కానీ ఈ 'ఒప్పుకోడం' మనకి- అంటే పెద్దలకీ, గురువులకీ, అధికార్లకీ, నాయకులకీ అంత సులభం గాదే! అదే సులభమైననాడు మన పిల్లలకేగాదు మనందరికీ ఎన్ని సమస్యలు మటుమాయమవుతాయో!

- వి. బాలసుబ్రహ్మణ్యం

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 12