నేర్చుకున్న భాష తమ ఉపాధికి దోహదపడుతుందని నమ్మేదిశగా కరిక్యులం రూపొందించాలి. ఈ లక్ష్యం కీలకాంశంగా కరిక్యులంలో చోటు చేసుకోవాలి.
ఈ కోణంలో పాఠ్య పుస్తకాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకనం, సామగ్రి వినియోగం ఉంటేనే పిల్లలను మనం కోరిన రీతిలో రూపొందించ గలం.
కింది సూచనలు గమనిద్దాం!
1. కరిక్యులం ఆధునికావసరాలకు అనుగుణంగా ఉండాలి.
2. భావ వినిమయ సాధనంగానే కాకుండా, ఆలోచనా మాధ్యమంగా, ఉపాధి సాధనంగా పరిగణించాలి.
3. చక్కటి భావ వినిమయకర్తలను రూపొందించే కరిక్యులం రావాలి.
4. భాషా విద్యలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ICT వినియోగం అందుబాటులోకి రావాలి.
5. భాష ద్వారా పిల్లల్లో ప్రధానంగా సహనంతో వినడం, అవగాహన చేసుకోవడం, నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, అవగాహనతో చదవడం, చదవడం ఒక అలవాటుగా మారడం, సొంతంగా వివిధ రచనా రూపాల్లో తన భావాలను వ్యక్తపర్చగలగడం వంటి భాషా నైపుణ్యాలు పెంపొందింపబడాలి. భాషా వ్యవహార రూపాల్లో ప్రదర్శించే స్థాయికి పిల్లలు ఎదగాలి.
6. వాడుక భాష/పత్రిక భాష అత్యంత కీలకపాత్ర పోషించాలి. (పాఠ్య పుస్తకం).
7. పాఠ్యాంశాలు సాహిత్య సేకరణకు వాటి వివరణకు పరిమితం కాకుండా పిల్లలకు ఆసక్తి కలిగించేవిగా ఉండాలి.
8. పాఠ్య పుస్తకాల్లోని అభ్యాసాల్లో కేవలం విషయ పరిజ్ఞానం, వ్యాకరణాంశాలకు పరిమితం కాకుండా వైవిధ్య భరితమైన కృత్యాలు, ఫజిల్స్ వంటివి చేర్చాలి. అట్లే స్వీయ రచనాశక్తిని పెంపొందించే వాటిని చేర్చాలి.
9. పిల్లల్లో స్వీయ రచనలను ప్రోత్సహించే అవకాశాలు కల్పించాలి. కల్పనాశక్తి, సృజనాత్మకత కోసం అవకాశం కల్పించాలి.
10. నిత్య జీవిత సన్నివేశాల ఆధారంగా పాఠశాల భాషా కరిక్యులం ఉండాలి. స్థానిక సాహిత్యం, భాష వీటిలో చోటు చేసుకోవాలి. వీటిని ప్రశంసించగల్గాలి.
11. మార్కులమయమైన మూల్యాంకనం స్థానే పిల్లల సహజ వికాసాన్ని అంచనా వేయడానికి దోహద పడేదిగా ఉండాలి.
12. ఉపాధ్యాయులు కేవలం చదివి అర్థతాత్పర్యాలు చెప్పే బోధకుడిగా కాకుండా పిల్లలను ఆలోచింప చేసే వ్యక్తిగా, సౌకర్యకర్తగా, సహభాగస్వామిగా ఉండాలి.
13. బోధన వ్యాకరణ కేంద్రంగా కాకుండా పిల్లల్లో అవగాహనా శక్తిని, వ్యక్తి సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడేదిగా ఉండాలి.
14. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాఠశాల ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. పాఠ్యపుస్తకాలు సైతం అందంగా, ఆకర్షణీయంగా నాణ్యంగా రూపొందించబడాలి.
15. భాషా బోధన పద్ధతులు యాంత్రికతతో కూడినవి కాకుండా పిల్లలందరినీ భాగస్వాములను చేసే (Participatory methods) పద్ధతులు group Discussions, ప్రాజెక్టు పనులు, అసైన్‌మెంట్లు, కృత్యాధార పద్ధతులు వంటివి వినియోగంలోకి రావాలి.
సువర్ణ వినాయక్
NCERT, General Body Member
Acadaemic Monitoring Officer, SSA
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 114