Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక సాహిత్యానికి చెందినవి. ఒక రకంగా చెప్పాలంటే సాహిత్యపఠనం. వాటి అర్ధాన్ని గ్రహించడమే ప్రధానంగా 6 నుండి 10వ తరగతి వరకు పాఠాల్లో కన్పిస్తాయి.

మచ్చుకు కొన్ని పాఠాలను చూద్దాం! శివధనుర్భంగం, కాశీపట్టణ విశేషాలు, పితృవియోగ వేదన, పారిజాతాపహరణం, ఆంధ్రనాయక శతకం, గిజిగాడు, పిలుపు, సరదాల పాట, దమ్మపదం, అష్టావధానం, ఆశ -నిరాశ వంటివి 9లో ఉంటే, 10వ తరగతిలో మాతృవేదన, జడివాన, ప్రవరుని స్వగతం, సందేశం, తామసి, ఊత పదాలు, వర్ణమాల, నా విషయం.... వంటివి ఉన్నాయి. నన్నయ, ఎర్రన, పెద్దన, వివిధ కవులు, దాశరథి, శ్రీనాధుడు, నంది తిమ్మన, శ్రీశ్రీ, గోపాల సుబ్రహ్మణ్యశాస్త్రి, చిన్నయసూరి వంటివారి గ్రంథాల్లోని విషయాలను పాఠ్యాంశాలుగా ఎంపిక చేశారు.

ఆనాటి రోజుల్లో అప్పటి అవసరాల దృష్ట్యా వీటిని ఎంపిక చేయడం సబబే కావచ్చు. కానీ ఇవి భాషాపరంగా పిల్లలకు ఏఏ సామర్ధ్యాలను వృద్ధిపరచడానికి ఉద్దేశింపబడ్డాయి. పిల్లల నుంచి బాషాపరంగా మనం ఏమి ఆశిస్తున్నాం? ఇవి వాటిని అందించడంలో ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి అనేవి అతి ముఖ్యమైన విషయాలు.

'భాష'ను పిల్లలు ఆనందంగా నేర్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడంలో ఉత్సాహం చూపాలి. కానీ దురదృష్టవశాత్తు పిల్లలు పై తరగతుల్లోకి వెళ్లేకొద్ది భాషాభిరుచి, పఠనాభిలాష, లేఖన నైపుణ్యం, తగ్గిపోతుండడం గమనార్హం. ప్రమాదకరంకూడా! పిల్లలకు ఇష్టమైన అంశాలు పాఠ్యాంశాలుగా లేకపోవడం ఒక కారణం కావచ్చు. అట్లే అభ్యాసాల్లో యాంత్రికత కూడా. పిల్లలు వైవిధ్యాన్ని కోరుకొంటారు. సవాళ్ళను స్వీకరిస్తారు. ఫజిల్స్, గళ్ళనుడి కట్టు, తార్కిక సమస్యలను విశ్లేషించడం ఇష్ట పడతారు. వీటికి 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో చోటు లభించకపోవడం గమనార్హం! అభ్యాసాల్లో అధికం ప్రశ్నలు జవాబులు, వ్యాకరణ భరిత అభ్యాసాలే! ఒక రకంగా అధిక వ్యాకరణ ప్రాధాన్యత, సాహిత్య ప్రాధాన్యత పాఠ్య పుస్తకాల్లో ఉండడం వల్ల పిల్లలు భాష నుండి దూరమవుతారేమో కూడా ఆలోచించాల్సిన అంశాలు.

భాషను మనం ఏమి కోరి అందిస్తున్నామో, అందు కనుకూలంగా పాఠ్య పుస్తకాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, సామగ్రి మూల్యాంకనం ఉండాలి. వీటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అభ్యసనం యాంత్రికమై, అది నిత్య జీవితావసరాల నుండి దూరం జరుగుతూ పోతుంది. ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం! ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల్లో ఎంతమంది ఇంటర్ చదువుతున్నారు? మొదటి పేపరు ఆంగ్లం తప్పనిసరిగా అభ్యసిస్తూ రెండవ పేపరుగా హిందీ/తెలుగు/సంస్కృతం... ఏదైనా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో తెలుగు తీసుకొనే వారి సంఖ్య ఎంత? ఎందుకు 10 సంవత్సరాలు చదివినా తెలుగు తీసుకోవడానికి వెనుకబడుతున్నారని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్కుల కోసం అని చెప్పేవారి సంఖ్య ఎక్కువే! కానీ ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి. 10 సంవత్సరాలు అధ్యయనం చేసినా ఆ విషయాన్ని తిరిగి అభ్యసించడానికి, కొనసాగించడానికి పిల్లలు ఇష్టపడడం లేదంటే వారి ఆత్మవిశ్వాసం, ఆ భాషపట్ల తమకున్న మక్కువ, వారు పొందిన అనుభవాలు ఇవన్నీ ప్రశ్నార్థక మవుతాయి. వాస్తవంగా పాఠశాల స్థాయి పూర్తయ్యేసరికి మన పిల్లల నుండి భాషాపరంగా మనం ఏమి ఆశిస్తున్నామో, స్పష్టంగా నిర్వచించుకోకపోవడమే లేక నిర్ణయించుకున్నా స్పష్టత లోపించడమో కారణాలై ఉంటాయి.

అందుకే ఐదవ తరగతి వరకు భాషను ఇష్టంగా అభ్యసించిన పిల్లలు 10వ తరగతికి వచ్చేసరికి తిరస్కరిస్తున్నారు. పిల్లల్లో భాషాపరంగా కన్పించే మరొక లోపం ఏమంటే మాట్లాడే భాషకు, రాసే భాషకు ఉండే సంబంధం గుర్తించకపోవడం.

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 112