Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలకు మహా ఇష్టం కదా. కనుక ఉపాధ్యాయుడు కథాత్మక కావ్యాలు, కవితలను సేకరించి తన వద్ద ఉంచుకోవాలి. ఇందుకొరకు నూతన యువకులు కృషి చేస్తే బాగుంటుంది. పిల్లలను కథాత్మక కావ్యాలు ఆకర్షించే విధంగానే పెద్దలను లోతైన, గంభీరమైన భావాలు నిండిన కవితలు ఆకర్షిస్తాయి. గ్రామీణులు రామాయణం, మహాభారతాలు, వివిధ జానపద గాథలు ఎన్నిసార్లు విన్నా విసుక్కోరు. చిన్న పిల్లలు కూడా దీర్ఘకావ్యాలైన వాటిలో కథా క్రమం ఉంటే ఓపికగా వింటుంటారు. అయితే భావాలతో గుదిగుచ్చిన చిన్న కవితను కూడా వారు ఓపికగా వినలేరు.

విద్యార్థులకు మనం ఏది నేర్పినా వారు తన్మయంతో స్వీకరించగలిగి ఉండాలి. అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. తన్మయంతో వారు విషయాన్ని పరిచయం చేసుకుంటారు. అర్ధం చేసుకుంటారు. అన్వయ పరుచుకుంటారు.

అయితే ఈ పరిచయం ఎలా చేయాలి. ఇంత వరకు దీనికి సంబంధించి ఎన్నెన్నో సూచనలు చేశాము. కవితను పాడే వినిపించాలి. ఆ పాడడం కూడా సుస్వరంతో, సరళమైనరాగంతో, ఉచిత అనుచితాలతో, అభినయ పూర్వకంగా, స్పష్టంగా, తాళబద్ధంగా ఉండాలి. అపుడే విద్యార్థులు ఆ కవితను స్వాగతిస్తారు.

మనం విద్యార్థులకు ఒక కవితను పరిచయం మాత్రం చేయాలేగాని, దానిని వారిచేత కంఠస్థం చేయించరాదు. అది నిరర్థకం. కవితలోని రసాన్ని అనుభవించాలేగాని వ్యర్ధంగా కంఠస్థం చేయించడం వలన ప్రయోజనమేమీ లేదు.

ఉపాధ్యాయుడు ఏదైనా పద్యం, కవిత, కావ్యం విద్యార్థుల ఎదుటకు తీసుకుని పోయినప్పుడు దానికి సంబంధించిన పూర్వపరాలు, నేపథ్యం కూడా సందర్భోచితంగా విద్యార్థులకు చెప్పాలి. వాటిలోని విషయాలకు సంబంధించి కూడా చెప్పడం మంచిదే. ఆ కావ్యంలోని కథను ముందుగానే తెలియజేసి నందువల్ల విద్యార్థులు కావ్యగానం చేసేటప్పుడు ఆనందంగా వింటారు. మధ్య మధ్య కూడా అర్ధంకాని కొన్ని కఠిన పదాలకు అర్ధం చెప్పవచ్చు. అవసరమైతే కావ్యాన్ని, కవితను, పద్యాన్ని గద్యరూపంలో కూడా తయారు చేసుకుని పిల్లల ఎదుట భావ స్పోరకంగా చదవడం మంచిదే.

విద్యార్థులు పద్యాలు చదివగలిగి నప్పుడు వారికి కవితలు కూడా పరిచయం చేయాలి. కవితలైనా, గేయాలైనా, పద్యాలైనా, కావ్యాలైనా కావ్యపాఠాలు అని చెప్పబడతాయి. క్రమక్రమంగా విద్యార్థులు వాటిలోని పదాలను అన్వయం చేసుకోగలుగుతారు. అర్ధం చేసుకోగలుగుతారు. భావాలు తెలుసుకోగలుగుతారు.


అనువాదం : ఎ.జి. యతిరాజులు

ప్రజాశక్తి వారి 'గిజూభాయి సమగ్రసాహిత్యం' నుండి.

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 109