Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్రమేనని అర్ధమవుతుంది. సాహిత్య చరిత్రను పరిశీలిస్తే గద్యం కన్నా పద్యమే మొదట వచ్చిందని తెలుస్తోంది. ప్రప్రథమంగా మాటలు కావ్యరూపం సంతరించుకున్నాయి. మన జానపద గేయాలు, రామాయణ, మహా భారతాలు, పాశ్చాత్య లోకంలో 'ఇలియడ్' వంటి మహాకావ్యాలు గద్యం కన్నా పద్యంలోనే రచింపబడ్డాయి. వాస్తవానికి సాహిత్యం రచయితల ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తూ ఉండలేదు. సాహిత్యమంటే సృజనాత్మకంగా వ్యక్తమయ్యే మానవ మనస్సు స్వరూపం. మానవులు మాట్లాడటం నేర్చుకోక మునుపే ఇది ప్రారంభమైపోయింది. మాటలతోపాటు ఇది వాఙ్మయం రూపంలో వ్యక్తమైంది. అత్యంత ప్రాచీన ప్రజల వాఙ్మయం మొదట కావ్యాలుగానే వెలువడింది. కావ్యం ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందిపోతుంది. మౌఖిక పద్ధతిలో ఇది సులభంగా జరుగుతుంది. కావ్యం తన పాడుకునే అర్హత వలన మానవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రాసలు, ఛందస్సులు, పునరుక్తుల వలన కావ్యం (పద్యం) ఒకే సమంగా, ఒక దానితో ఒకటి బంధింపబడి వరుసక్రమంలో ఉంటుంది. ఇందువల్ల కావ్యం తరతరాలుగా, వారసత్వంగా, ఒకరి నుంచి ఒకరికి అందుతూ ఉంటుంది.

ప్రాచీనుల సాహిత్య భాండాగారం కావ్య రూపంలో ఉంది. పద్యరూపంలోనే మన ప్రాచీనులు తమ ప్రతిభను, జ్ఞానాన్ని వ్యక్తపరిచారు. కావ్యం ద్వారా వారు తమ కళలను, చరిత్రను చెబుతూ వచ్చారు. అందులోనే వారు తమ అభిలాషలను, నీచత్వాన్ని కూడా బహిర్గత పరిచారు. పద్యంలో వారు శోకం, మోహం, ప్రేమ మొదలగు స్పందనలను సంగ్రహించారు. నిజానికి కావ్యం వారికి సంకలన స్థలంగా, చరిత్ర రచనగా మిగిలి పోయింది. ఆ కాలంలో కావ్యం ప్రజల జీవితానికి దర్పణంగా మారింది. కావ్యాన్ని పిల్లలు, పెద్దలు అందరూ ఎరిగి ఉన్నారు. నేర్చుకుంటూ ఉన్నారు. ఇందులో నుంచి కొత్త కావ్యాలు రచించడానికి కూడా ప్రేరణ పొందుతూ ఉన్నారు. ప్రాచీన కావ్యాలంటే మన జానపద గేయాలే. నేటికీ చిన్నపిల్లలు జానపద గాథలు, గేయాలు బాషా ఇష్టపడతారు. నిజానికి వారికి అవే మనం ఇవ్వాలి.

తల్లి జోలపాటలు పాడినప్పుడు పిల్లవాడు నిద్రపోతాడు. తల్లి రోటిలో దంచుతూ, రుబ్బుతూ, బట్టలు కుడుతూ, పూసలు గుచ్చుతూ, పాటలు పాడుతూ తన పనులు చేసుకుంటున్నప్పుడు పిల్లవాడు ఆమె చుట్టు ప్రక్కలే ఉంటాడు. తండ్రి దేవుడి విగ్రహం ముందు శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆయన ప్రక్కన అణకువగా కూర్చొని పిల్లవాడు వింటూ ఉంటాడు. ఈ సందర్భాలలో వాడు పద్యం, కావ్యం, కవిత వింటాడు. మనస్సులో గ్రహిస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇంట్లోనే పిల్లవాడికి పద్య శిక్షణ లభిస్తుంది. మనం పురాతన కాలం గురించి ఆలోచించినప్పుడు ఆ కాలం పిల్లలకు కావ్యం ద్వారానే, పద్యం ద్వారానే ఎన్నో ప్రాపంచిక విషయాలు తెలిసేవి. వాటి నుంచి వారు రసాస్వాదన కూడా పొందే వారు. ఈనాడు కూడా కేవలం మౌఖిక సాహిత్యంలో వున్న పాటలు, పద్యాలు పిల్లలకు ఎంతో ఆనందం చేకూరుస్తున్నాయి. అయినా ప్రపంచం ఎంతగానో మారి పోతూ ఉంది. దాని పర్యవసానంగా జానపద గేయాలు, గీతాలు విస్మృతిలో కూరుకుపోతున్నాయి. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా వాటిని మరచిపోతున్నారు. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు త్వరత్వరగా మారిపోతున్నాయి. తిరుగలితో జానపద గేయాలకు గట్టి సంబంధం ఉండేది. నేడు గాలి మరలతో ఎలాంటి పాటలు, పద్యాలు తయారుకావడం లేదు. నిప్పుల కుంపటితో పాతకాలపు పాటలు ఉండేవి. అయితే నేడు గ్యాస్ స్టౌవ్‌లతో ఎలాంటి పాటలు పుట్టడం లేదు. అయినా మనం ఎన్నటికీ జానపద గేయాలను, జానపద కావ్యాలను వదులుకోరాదు. వీటిని మన పద్య శిక్షణ నుంచి తొలగించి వేస్తే విద్యార్థుల విద్య పునాదిలేని భవనమే అయిపోతుంది.

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 106