Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్య, కవితా శిక్షణ

గిజూభాయి

పిల్లలకు భాష నేర్పించడమంటే వారికి భాషలోని గద్యాన్ని, పద్యాన్ని పరిచయం చేయడమే. ఈ పరిచయం చేయడమనేది ఎంత దృఢంగా, స్పష్టంగా జరుగుతుందో భాషా శిక్షణ కూడా అంతే దృఢంగా, స్పష్టంగా ఉంటుంది. ఇలా పరిచయం చేయడానికి రెండు సాధనాలు ఉన్నాయి. ఒకటి మౌఖిక సాహిత్యం, రెండు లిఖిత సాహిత్యం. పిల్లవాడు చిన్నప్పటి నుంచి మౌఖిక సాహిత్య పరిచయం పొందుతూనే ఉంటాడు. వాడికి చదవడం, వ్రాయడం వచ్చిన తర్వాత లిఖిత సాహిత్యం పరిచయం అవుతుంది. మౌఖిక సాహిత్యమైనా లేక లిఖిత సాహిత్యమైనా, ఈ రెండింటిలో కూడా ప్రస్తుతం విద్యార్థులకు గద్య సాహిత్యమే లభిస్తోంది. పద్య సాహిత్యం ఆలస్యంగా, అల్పంగానే లభిస్తోంది. ఇళ్ళల్లో మనం మాట్లాడేది మౌఖిక సాహిత్యం. ఇంట్లోనైనా లేదా బయట అయినా మాటలు పరిచయం కన్నా సంగీత పరిచయం అందరికీ స్వల్పంగానే లభిస్తుంది. మన పాఠ్యపుస్తకాల్లో కూడా గద్య పాఠాలకన్నా పద్య పాఠాలు అత్యంత తక్కువగానే ఉంటాయి.

ఈ వాస్తవ పరిస్థితుల కారణంగా పిల్లవాడు బాల్యం నుంచే గద్యాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాడు. దీనితోనే చాలామంది పిల్లవాళ్ళకు పద్యం, కవిత, పాట అర్ధం కావని వాటి నుంచి వారు ఎలాంటి సంతోషం పొందరని తప్పుగా అనుకుంటారు. అందువల్లే పిల్లలకు పద్యం ఆలస్యంగా, తక్కువగానే పరిచయం చేయాలని విద్యావేత్తలు కూడా భావిస్తారు. పెద్దలు కూడా పద్యానికన్నా గద్యానికే అధిక ప్రాధాన్యతనిచ్చి గద్యంపై మక్కువ ప్రదర్శిస్తారు. గద్యం సులభమనిపిస్తుంది. దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగానే గద్యాన్ని రచయితలు సృష్టిస్తారు కూడా.

మనం పోల్చి చూసినప్పుడు గద్యంకన్నా పద్యం కఠినంగా ఉంటుంది. అయితే వయస్సు మళ్ళిన పెద్దలకు పద్యం ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తుంది. దీనిని బట్టి పద్యానికి ఉన్న స్థానం ఉన్నతమైందనీ, దానిని వయస్సు పెరిగిన వారే అనుభవించగలరని అనుకుంటాం.

ఇన్ని విధాలుగా ఆలోచించినా వాస్తవం మనం గమనించాల్సి ఉంటుంది. మనం విద్యార్థులకు గద్యం అధికంగా నేర్పిస్తాము, పద్యం తక్కువగా నేర్పిస్తాము. అందువల్లే నేడు పద్యంలోకన్నా గద్యంలోనే అందరూ రసానుభూతి పొందుతున్నారు.

ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి మన ప్రస్తుత పద్య శిక్షణ విధానంలో మార్పు తేవలసిన అవసరం కనబడుతోంది.

మొదటి మార్పు పిల్లలకు చిన్నతనంలోనే పద్యం నేర్పించరాదనే తప్పుడు అభిప్రాయం నుంచి మనం బయటపడాలి. బాగా ఆలొచించి చూస్తే ఇది భ్రమ

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 105