Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండింటా ఉన్న హృదయాన్ని పట్టుకొనే ప్రయత్నం చేశాము.

వచ్చినవన్నీ 99శాతం గ్రామీణ పేద ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలవే. జనవిజ్ఞాన వేదికకు ప్రైవేట్ స్కూళ్ళతో గల పరిచయం తక్కువ గావడం దీనికి ఒక కారణం కావచ్చు. కానీ అంతకన్నా ముఖ్యమైన కారణం అక్కడి పిల్లల భాషా దారిద్ర్యం. కథల్నించి, కల్పనా ప్రపంచం నుంచి స్వంత ప్రయత్నాల నుంచి, స్వేచ్ఛ నుంచి వీలున్నంత దూరం చేసి ప్రశ్నోత్తరాల్ని నూరి పోయడాన్నే విద్యగా ఈ స్కూళ్ళు నిర్వచించుకోవడం.

వస్తువును పరిశీలిస్తే దాదాపు అన్నీ పాత కథలే. అవే నక్కలు, అవే దయ్యాలు, అవే నాగరాజులు, అవే రాజులు, అదే పేదరాశి పెద్దమ్మలు, అదే గుడ్డిపోలి. 'ఎన్ని నవ నాగరికతా వాసన లొచ్చినా, ఎన్ని సినిమాలు, సీరియళ్ళూ వచ్చినా, పిసరంత మార్పు సైతం పిల్లల కథల్లో రాక పోవడమే మిటి? అని మనం ఆశ్చర్యపోతాం. తరతరాల తెలుగు పిల్లల కథలు అంత బలమైనవి. అంత సన్నిహతమైనవీ అన్నమాట. పిల్లల స్వాప్నిక జగత్తులోకి మన ఆషామాషీ వ్యవహారాలు అంత సులభంగా జొరబడలేవన్న మాట. వాళ్ళ లోకం అంత అమలినంగా ఉండిపోయిందన్న మాట. అసలువాళ్ళ ప్రపంచం వాళ్ళ ప్రపంచమే.అందులో పిల్లలది స్వంతం ఏదో ఉంది. అసలు పిల్లలందరూ ఒకటే. వారిలో ఏదో అద్భుతమైన సమానత్వం ఉంది. ఈ సమానత్వం వాళ్ళ కాల్పనిక జగత్తులో కన్పిస్తుంది.

ఇక పాత్రలన్నీ సాదాసీదా పాత్రలు. అది నక్క గావచ్చు. నాగేంద్రుడు కావచ్చు, రాజు గావచ్చు. పశవులు మేపడం, కళ్లాపి చల్లడం, పెళ్ళి సంబంధాలు వెతకడం, అమాంతం బోల్తాపడి పోవడం మనం చూస్తాం. చాలా చిన్న ప్రాణులు చాలా పెద్దవాళ్ళకి సాయం చేస్తాయి. అపాయాలు చాలా సామాన్యంగా ఉంటాయి. పెళ్ళి సంబంధాలు వెతికి పెట్టడం, శత్రువును పల్టీ కొట్టించి ప్రమాదం నుంచి బయటెయ్యడం కంటే మించిన సాయాలుండవు. కూతుళ్ళ పెళ్ళిళ్ళది సమస్యే కాదు. మహా మహారాజులు నక్కలకి పిల్లనిచ్చేస్తారు. అల్లుళ్ళలో కట్నాలకు వేధించే దుర్మార్గులుండరు. అమాయకులు, అడిగిందే తడవుగా సాయం చేసేవాళ్ళు ఉంటారు.

ఆడపిల్లలు అమాయకంగా ఉండరు. చమత్కారులుగా ఉంటారు. సవతి పోర్లు చాలా ఎక్కువ. అడవులకి తరిమెయ్యడం, బిడ్డల్ని దాచిపెట్టెయ్యడం, వాళ్ళని పేదోళ్ళ కిచ్చి పెళ్ళి చేసేయ్యడం లాంటివి పెద్ద భార్యల నిత్య కృత్యాలు. ఒక్కోసారి కథలో పెద్ద చిక్కుముడి వచ్చి పడిపోతుంది. అప్పుడల్లా శివపార్వతులు ఆకాశాన పోతుండాల్సిందే. పార్వతి బాధపడాల్సిందే. శివుడు మంచి మొగుళ్ళా ఒప్పుకోవలసిందే. ఏదో పరిష్కారం చెయ్యాల్సిందే.

అన్నీ మనకొచ్చే సమస్యలే. పరిష్కారాలు మన ముందు కన్పించేవే. రాజులు కొడుకులు కూడా ఊరేగింపులో తప్పిపోతారు. మహారాజులు కూడా పొలం దున్నేపుడు సద్దిమూట కోసం ఎదురు చూస్తుంటారు. నాగేంద్రుడు కూడా ఆడపడుచుకు గాజులు పెట్టించడం కోసం లోకాలన్నీ వెతుకుతాడు. అల్లుళ్ళైతే తిక్కమొహాల వాళ్ళు. కోరి కష్టాలు తెచ్చుకుంటారు. వాళ్ళ భార్యలే వాళ్ళనెలాగో బయటవేస్తారు. దేవలోకాలు ఉంటాయి గానీ అవి నక్క అరుపులకే గడగడలాడిపోతాయి. దయ్యాలైతే ఆవులు మేపి, రాజు కుమార్తెల్ని వెతికి పెట్టి మనుషుల కోసం నానా కష్టాలు పడతాయి. సూర్య చంద్రుల క్కూడా మామూలు అన్నదమ్ముల కొట్లాటలు తప్పవు. జనం దగ్గర పరువు పొయ్యాక ఒళ్ళు దగ్గర పెట్టుకోక తప్పదు. ఎవ్వరికీ పెద్ద పెద్ద ఆశలుండవు. ఏదైనా ఉంటే మంచిపిల్ల కావాలని కోరుకోవడమే. మహా మహా దేవుళ్ళిచ్చిన వరాల భవంతుల్లో 'అన్నం, కూరలు, కారప్పూస, గిన్నెలు, మంచాలు అన్నీ' ఉంటాయి. ఈ 'అన్నీ'కి మించిన కోరికలే ఉండవు! మహారాణి పేరు

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 102