పుట:Parama yaugi vilaasamu (1928).pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

పరమయోగివిలాసము.



రంగేశువైభవరాజసంబులకుఁ
బొంగి యాతనికి సబ్బురమంది చిక్కి
ముదమునఁ దనతండ్రిమోము వీక్షించి
విదితంబుగా రంగవిభు చరిత్రములు
విన విన వీనులవిందు లయ్యెడిని
వినుపింపు నాకు సవిస్తరంబుగను
అన విని భట్టనాథార్యుఁ డాతనయఁ
గనుఁగొని పలికె నగ్గలమైన కూర్మిఁ
బద్మాసనుఁడు మున్ను పాలమున్నీటి
పద్మాక్షు గుఱిచి తపంబు గావించి
బహువేదశృగంబు ప్రణవాత్మకంబు
మహితంబు నైన విమానంబుతోడఁ
బంకజాక్షుఁడు శేషపర్యంకుఁ డగుచుఁ
బంకజాసనునకుఁ బ్రత్యక్ష మయ్యె
నైన నయ్యసమాన మగువిమానంబు
తోనఁ గైకొని వేగ తోయజసూతి
సత్యలోకమునకుఁ జని నిజవసతి
నత్యంతసంకలితాత్ముఁ డై నిలిపి
యోజ దప్పక వివిధోపచారములఁ
బూజ సేయుచు నుండి వుష్కరాత్మజుఁడు