పుట:Parama yaugi vilaasamu (1928).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

పరమయోగివిలాసము.


గొజ్జంగిపొదలకుఁ గుదురు లమర్చి
గుజ్జుమొల్లల కాముకొన నీరుగట్టి
శరవీరములదండఁ గాలువల్ దీర్చి
విరవాదిపాదులు విరివి యొనర్చి
కలయంగ మరువంబుకల పేర్పరించి
యలవిమీఱినమల్లియల కంటులొత్తి
పారిజాతములకుఁ బాదు లమర్చి
యీరీతి మఱియు ననేకవైఖరుల
నారామసీమ సొంపారెడుపుష్ప
భూరుహవల్లికాభూరిసంతతికి
నవవసంతుఁడపోలె ననలొత్తఁజేసి
సవరగా నచట నేచక్కిఁ జూచినను
మిసిమిగా నల్లడ మిఱ్ఱు బల్లంబు
కసవుఁ గట్టెయు ఱాయుఁ గంప లేకుండఁ
బస మించు కన్నులపండువు గాఁగ
వసుమతీసతికన్నువలె నుండఁజేసి
పరిమళమిళితపుష్పంబులు గోసి
కరమర్థి నించిన కరఁడిచే బలసి
పనుపడ మనురాజపరనచే వెలసి
మనమున సంతోషమగ్నుఁడై తులసి