పుట:Parama yaugi vilaasamu (1928).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

పరమయోగివిలాసము.


భజనఁ జూపట్టు నాపల్లకికొమ్ము
భుజమున నిడుకొని పురవీథులందు
మెరయింప నప్పౌరమీనలోచనలు
పరమైన యపరంజిపళ్ళెరంబులను
ఘనసార దీపముల్ కడువింత లెసఁగ
నొనరించి యారతు లొసఁగ నచ్చరలు
దేవకామినులు భూదేవకామినులు
సేవించి దీవించి సేసప్రా లిడఁగ
నీరీతి పురమెల్ల నేగింప మగుడి
ధారుణీవిభుఁడు సద్మమున కేతెంచె
నారాజుమై నప్పు డామౌనిరాజు
చారుకృపామృతాసారంబు నించి
యతని వీడ్కొని రంగహర్మ్యసన్నిధికి
నతివేగమునఁ బోయి యవనతుం డగుచు
దనసేయునట్టికృత్యము నీచమైన
ఘనతరభోగ్యంబు గాఁగఁ జేకొన్న
యీసర్వసులభుని నిందిరానాథు
వాసుదేవునిఁ దండ్రి వాత్సల్యజలధి
యేమని వినుతింతు నిభరాజవరద!
నీమహామహిమ వర్ణింప శక్యంబె?