పుట:Parama yaugi vilaasamu (1928).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము.

5


తలఁపు తన్మూర్తులం దగులంగఁ జేసి
యలయంజనాద్రీశు నాత్మలో నిలిపి
యరు దంది శ్రీవేంకటాధీశువాక్య
సరణి నాకబ్బంబు సవరింపఁ బూని
కడలి దాఁటంగ రాఘవభూ[1]వరుండు
కడఁకమై సేతువుఁ గట్టించునప్పు
డనిలజముఖు లైన యగచరనాథు
లనుపమశక్తి మహాపర్వతములఁ
గట్టకట్టంగఁ దాఁ గట్టనుంకించు
నొట్టిన లోకూర్మి యుడుత చందమున
భువనంబులోన నభోమణి యొప్ప
దివిఁ గీటమణియును దెలి వొందుకరణి
సామజబృందంబు చనుదెంచుత్రోవఁ
జీమలపంక్తి వచ్చిన[2] విధంబునను
వేదంబులెల్ల ద్రావిడముగాఁ జేసి
వేదాంతవిదులుఁ గోవిదులు నైనట్టి
గురుతరు లగుపరాంకుశముఖ్యయోగి
వరులవైభవముఁ గావ్యము సేసినట్టి
యలఘుపూర్వాచార్యు లగువారియెదుట
నిల నితరుఁడు కావ్య మెట్లు చెప్పెడిని


  1. విభుండు
  2. చందమునను