పుట:PandugaluParamardhalu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశ్రయించడం దేవతల రాజుకి అభిమానమనిపించింది. అందుచేత తన సేవకులను పంపి ప్రతిరోజు తెల్లవారగట్ల దొంగతనముగా రుక్మాంగదుని తోటలోని పువ్వులు తెప్పించుకొనేవాడు ఇంద్రుడు. ఇలా కొన్నాళ్ల పాటు సాగింది.

     రుక్మాంగదుని పూజవేళకు తోటలోపూవులు లేకపోతూ ఉండేవి.  ఈ సంగతి వనపాలకులు తమ రాజుతో చెప్పారు.  జాగ్రత్తగాకాసి దొంగల్నిపట్టుకోమని రాజు చెప్పాడు.  ఎంత జాగ్రత్తగా కాసినా దొంగల జాడ దొరకలేదు.  దేవ సేవకులు మానవులకు కనిపించరుకదా! వారు అదృశ్యంగా ఉంటూ పూవులు కోసుకుపోయేవారు.
   ఇట్లా ఉంటూ ఉండగా జాబాలి అనే ఋషి ఒకడు ఆమార్గాన పోతూ ఆ తోటలో మకాం వేశాడు.  యోగాభ్యాసం చేసుకోవడానికి ఆప్రదేశం బాగా ఉండడం చేత అతను అక్కడకొన్ని రోజులపాటు ఆగాడు. తోటమాలీలు అతడే తమతోటలో పూవులు దొంగిలిస్తున్నాడనుకున్నారు.  కాగావారు ఆ యోగిని పట్టుకొని తమ రాజు వద్దకు తీసుకువెళ్ళారు.
    రాజు సంగతి సందర్భాలన్నీ విచారించి యోగి మహత్తు తెలుసుకుని అతని పాదాలకు ప్రణమిల్లి తప్పు క్షమించమని  కోరాడు.  రాజు నిష్కల్మషహృదయాన్ని జాబాలి ఆకళించి అతనిని మన్నించాడు. అంతేకాక ఆముని రాజుకు కొన్ని మూలికలు ఇచ్చాడు.  ఆమూలికలు కనుక తోటలో రాత్రి వెలిగిస్తే ఆ పొగసోకి గొందలు దొరికి పోతారని చెప్పాడు.
    ఆ రాత్రి రాజు ఆమూలికలను తనతోటలో వెలిగిస్తాడు.  తెల్లవారు జామున వచ్చిన దేవసేవకులు రాజుకు దృశ్యమానులై దొరికి పోతారు.  ఆ మూలికల పొగసోకడం చేత వారికి భౌతిక రూపాలు వస్తాయి.  ఆ స్థూలరూపాలతో తిరిగి పైకి స్వర్గలోకానికి వారు ఎగరిలేక పోతారు.  అప్పుడు వారు సంగతి తంతా రుక్మాంగదుడికి చెప్పి వేస్తారు.  ఆ మూలికల పొగమూలకంగా తమ సూక్ష్మ శరీరాలకు భౌతిక పదార్ధాలు సోకి స్థూల శరీరాలు అయిపోవడం చేత తాము తిరిగి దేవలోకానికి పోలేక పోతున్నామని వాపోతారు.,
   ఇంతలో అక్కడికి నిరంతర ఏకాదశివ్రత నిష్ఠవలన అతి పవిత్రురాలైన ఒక చాకలిది వస్తుంది.  ఏకాదశవ్రతనిష్ఠ వలన అతి పవిత్రురాలైన ఆ చాకలిది అప్పుడు ఆ దేవసేవకులను ముట్టుకుంటుంది.