పుట:PandugaluParamardhalu.djvu/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపయోగిస్తూ రావడం ఆరోగ్య మార్గమని గుర్తింపవచ్చును.

   చెరుకుముక్కలు, అరటిపళ్లు మొదలయినవి కూడా ఈ ఉగాది పచ్చడిలో చేర్చడం కొన్ని ప్రాంతాల్లో ఆచారమై ఉంది.  ఇవి చెర్చే విషయంలో అభ్యంతరం చెప్పడానికి ఏమీ ఆస్కారం కనిపించదు.
    ఈ పచ్చడిలో కొందరు తేనె కూడా కలుపుతారు.  యూదులు తమ సంవత్సరాదినాడు ద్రాక్షపండ్లు తేనె తింటారనే విషయం తెలుసుకోవడానికి ఈ సందర్భంలో ముచ్చటగా ఉంటుంది. "హిందువుల పండుగల"లో శ్రీసురవరము ప్రతాపరెడ్డి వ్రాసిన దానినిబట్టి ఈ పచ్చడిలో గసగసాలు, చారపప్పు మొదలయిన మసాలా దినుసులు వేయడం కూడా కొన్ని ప్రాంతాల్లోవాడుకగా ఉన్నట్లు కనిపిస్తుంది.  వృద్దాచారరీత్యాకాని, ఆరోగ్యవిజ్ఞానదృష్ట్యా కాని ఈ ఉగాదిపఛ్ఛడిలో మసాలా దినుసులు చేర్చడం సమర్ధనీయం కాదని చెప్పవలసి ఉంటుంది.
      ఈ పచ్చడిలో ఉప్పు ఎంత మాత్రం చేర్చకూడరు.
     వసంత ఋతువు ప్రారంభంలో ఆకాలాన దొరికే వేపపువ్వు, చింతపండు, బెల్లము కలిపి పచ్చడి చేసి సేవించడం రాగల కాలానికి ఒకవిధముగా స్వాగతోపచారం చేయడమే కదా! మధురామ్ల ద్రవ్యాలతో చేర్చి చేదురసము గల వేప పువ్వును గుజ్జు పచ్చడిగా చేసికొని తినడంలో వేదాంతార్ధం కూడా కొంత యిమిడి ఉండవచ్చు.  ఈ పచ్చడి తినడం తియ్యనినోటృఅ చేదు మేపడమే, వేప తిక్తరస ప్రధానమైనది.  తిక్తపదార్ధాన్ని మధురామ్ల ద్రవ్యాలతో కలిపి తినడం కాలం కొనిరాగల కష్టసుఖాలకు తాము సంసిద్దులమై ఉన్నామని చాటడం, కష్టాలుకానీ, సుఖాలుకానీ మేము అనుభవిస్తామనడానికి ఈ పచ్చడి సేవనం ఒక సూచన. రాగల అరిష్టాలకు, అదృష్టాలకు మేము సిద్ధంగా ఉంటామని శపధం తీసుకొన్నదానికి ఈ పచ్చడి లక్ష్యమై ఉంటుందని బావించవచ్చు.
                          (7) పంచాంగ శ్రవణం
     ఉగాదినాడు పంచాంగ పూజ సల్పి మధ్యాహ్నం పంచాంగ శ్రవణం చేయడం ఆచారమైఉంది.
   తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే అయిదు అంగములు గలది పంచాంగము.