పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మపాలమహారాజు కథ

95


బున నందందు వెఱ్ఱివానివలె పరిభ్రమించుచుండెను. ఆ నిశీధమున, ధర్మపాలుఁడు, సమాధినిష్టాగరిష్టుఁడై దర్పణ మహాత్మ్యలోలుఁడై , యా పోజ్యోతులం బరబ్రహ్మావలోకనం బొనరించుచున్న తరి నాయద నెఱింగి యాతనిం బోకార్పఁదలంచి మాంత్రికుఁడు కరవాలంబును సవరించుచుండెను. అంతలో విధివశంబున నటకువచ్చిన వీరపాలుఁడా దారుణ కార్యముం దిలకించి వెనుక పాటునం జని తన కరవాలంబున నామాంత్రికుని తల నేలబడునట్లు ఖండించెను. ఆ సవ్వడికి సమాధిభంగమైన ధర్మపాలుఁడు కన్నులువిచ్చి యెదుటనున్న మాంత్రికుని ఖండిత కళేబరంబును తన సోదరునిం గాంచి యాశ్చర్యానందములతో నాతనిం గౌగలించుకొని, తమ్ముఁడా! ఇందేలవచ్చితివి? ఈతఁడేల మరణించె" నని యడుగ, కొండొక వడికి వీరపాలుఁడు సోదరుని గుర్తించి, యానంద దు:ఖ పరవశుండై కన్నీరు మున్నీరుగాఁ గార్చుచు, నా మాంత్రికుని కపటవర్తనమును తన జనని తంత్రమును ఘూర్జర భూపతి ప్రయత్నమును తమ ప్రయాణమును, దెలిపి, తండ్రిగడకు రమ్మని త్వరపెట్టెను. ధర్మపొలుఁ డదియెల్ల నాలకించి కలయో నిక్కమో యని భ్రమించి, గురుని కడ సెలవుగైకొని, నిజజనకుని దర్శింప నాతఁడు మృతినందెనని తలంచిన కుమారుని పునరాగమనమునకు పెన్నిధి లభించిన పేదచందంబున నుబ్బి పలుమారులా బాలుని ముద్దు బెట్టుకొని యానంద పరవశుఁడై యుండెను.గతకృత్యంబులం దలచుకొని కాంతిమతి పశ్చాత్తప్తయై ధర్మపాలునిక్షమా ప్రార్థనం బొనరింప నాతఁ డామెను మన్నించెను. వారందఱును మఱునాడు పతంజలి మహర్షికి నమస్కరించి సెలవుగై కొని, ఘూర్జర రాజధానికరుగ నారాజు చిత్రాంగదా ధర్మపాలుర వివాహముతో పాటుగాఁ దన సోదరుని పుత్రికయగు నీలాంగదును వీరపాలున కిచ్చి రెండు వివాహంబులును ఏకముహూర్తంబున మహా వైభవంబున నొనగించెను. ప్రియజనని లేకపోయెనను కోఱంతదక్క మఱియే విచారంబును లేక దర్పణ ప్రభావ సంపన్నుఁడై ధర్మపాలుఁడు చిర కాలము చిత్రాంగదతో గూడి మహారాష్ట్ర రాజ్యము బాలించి సుఖంబుగా నుండెను.