పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

పండ్రెండు రాజుల కథలు


నీతోఁ గలసి సరస్సున స్నానమాడి ఫలపుష్పాదులంగొని కాలభైరవాలయంబున కరిగెను. ఆకాలభైరవుం డాలయమధ్యమున మహా భయంక రాకృతితో నుండెను. ఆతని సమీపమున భీకరఖడ్గ మొకటి మెఱయుచుండెను. ముని విక్రమసేనుం జూచి—— “రాజపుత్రా! ఇప్పుడు నీ వీకాలభైరవునకు సాష్టాంగ నమస్కారం బోనర్పవలసియున్న" దని పలుక—— నాతండేమియు నెఱుంగని చాడ్పున, “యతీంద్రా! నేను రాజపుత్రుండనగుట నమస్కారం బొనర్చుట నెఱుంగను. తామొక్కమారు చూపెదరేని నేనట్లే యొనర్తు ” నని పలుక నాకపటముని కాలభైరవునకు సాష్టాంగ ప్రణామంబు సలిపెను.—— అదియే తరుణమని రాజపుత్రుండటనున్న కత్తితో వానితలద్రుంచి భైరవునకు బలియిచ్చెను—— వెంటనే కాల భైరవమూర్తి యాతనికిం బ్రసన్నుఁడై “బాలకా! నీ ధైర్యంబునకు మెచ్చితిని! ఇంక నీకిష్టార్థ పరిపూర్తిగావించెద——తొలుత నేబోధించు, "అమనస్క" ప్రభావంబును శ్రద్ధాళుడవై యాకర్ణింపు " మని పలుక, నాతఁడద్దేవునకు నమస్కరించి సర్వము, నాకర్ణించెను.

అంతట కాలభైరవుడు, “రాజపుత్రకా! నీకిష్టములగువరంబులం గోరుకొ"మ్మని పలుక, నారాజకుమారుం డమితానందము నంది. కాలభైరవునకుఁ బునః పునః ప్రణామంబులనాచరించి యోదేవా! నీదయచే దేవతల కసాధ్యమగు నమనస్క మహాత్యము నెఱింగితి. ఇక నాకేకోరికలును లేవు. ఐనను, కపటాత్ముండగు నీమునిచే దేవర వారికి బలియీయఁ బడిన రాజకుమారులనందఱం బ్రతికింపుము. ఇదియే మదీప్సితం "బని పలుక, నా దేవుండట్లే వారికి జీవ ప్రధానంబు సలుప నా రాజపుత్రులందఱును, కాలభైరవునితో పాటుగా, విక్రమసేనునకు నమస్కరించిరి. ఆఫునర్జీవితులైనవారిలో తన మిత్రుండగు, గుణసాగరుండును గాన్పింప నమితానందమున వాని గౌగిలించుకొని, యానాడే యారాజపుత్రశతకముతోడను శుచిముఖీ మణిమాలలతోడను నిజపురంబునకరిగి, తమ పోబడి నెఱుంగక కృశించుచున్న తల్లిదండ్రులకు మహానందములం గూర్చి బహుకాలము రాజ్యముం బరిపాలించెను.