పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్రమసేన మహారాజు కథ

83


ణములు లేచి వచ్చినట్లయ్యెను. కాని, యోసుకుమారా! జగదేక సౌందర్యశాలివగు నినుం జూడ నాకు జాలి గల్లుచున్నది. నీవిప్పుడు భీకర శార్దూలకరాళంబున నిఱుకు కొంటివి. ఈ యేకాక్షి సామాన్యురాలు గాదు, నిన్ను గాంచి నంతనే మ్రింగి వేయకమానదు. ఇందులకేది యుపాయం" బని వాపోయిన నారాజకుమారుఁడు నవ్వి "యో బేలా! విచారింపకుము. నా కీరాక్షసి యొక భయకారణంబని తలంపకుము, ఇట్టిరక్కసులను వేవురనైన సఱ నిమేషంబునఁ బోకార్పంగల"నని పలికెను. అతని సాహసదైర్యవచనసరణికి మెచ్చియు నా కోమలాంగి “రాజకుమారా! ఏకాక్షి రాక్షసియనిన నీవు సామాన్య దానవి యని భావించితివి, కాని యది సురాసురమానవాదుల కలవిగానిది. దాని ప్రాణము లొకానొక దీవియందలి తాళవృక్షముపై గల యొక చిలుక నోటియందలి బరిణలోన భ్రమరాకృతిం దాల్చియుండును. ఈ కీలెఱింగి దానిని సంహరింపవలయు"నని పలుక, విక్రమసేనుఁడు కొండొకవడి చింతించి——"బాలా! అట్లయిన దీని నుపాయంబున సంహరించి నిన్ను రక్షింతును—— ఇప్పటికి నీవు నన్నే దేనియుపాయంబున నిందేదాచియుంచి యాదానవి జీవితరహస్యము నెల్లపాంగముగా నెఱింగి నాకుఁ జెప్పు” మనవుఁడు మణిమాల యా రాజసుతు నొక బల్లినిగా మార్చి యేప్పటియట్లుండెను. అంతలో దెల్లవాఱుటయు, నాహారార్ధ మరిగిన యా నిశాచరి——భూమ్యాకాశములు బ్రద్దలగు తెఱంగున, "నరవాసన! నరవాసన!" యని బొబ్బలు పెట్టుచు నటకు వచ్చెను. అంత మణిమాల నగు మొగముతో దాని కెదురుగాఁ జని "తల్లీ! ఎక్కడి నర వాసన వచ్చెనీకు? నేను నరజన్మమునందిన దానను గానా? నా వాసనయే వచ్చియుండును! ఇట్లేల బెంగటిల్లెద”వని పలుక నా యేకాక్షి సంతృప్తమానసయై మణిమాలం దనయంకమునఁ గూరుచుండఁ బెట్టుకొని, యతి ప్రేమంబున ముద్దాడఁ దొడంగెను. ఆదే తరుణమని యా మదమరాళగమన—— భీతినందినగతి నటించుచు—— తల్లీ! నేటి యుదయంబున నిరువురు యక్షదంపతు లాకాశమార్గంబునఁ