పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్రమ సేన మహా రాజు కథ.

పూర్వకాలంబున అవంతీనగరముం బరిపాలించుచుండిన కీర్తిసేన మహారాజునకు విక్రమసేను డనుకుమారుఁడు గలిగెను. ఆ విక్రమసేనుఁడు సమవయస్కుడును, సచివనందనుఁడును నగుగుణసాగరునితో గలసి సకలవిద్యారహస్యంబుల నెఱింగి దినదిన ప్రవర్ధమానుండగుచు క్రమంబుగ సంప్రాప్తయౌవనుం డయ్యెను. అట్టియెడ నోకనాడు దైవికంబుగ నబ్బాలకునకు దేశ సందర్శనా పేక్ష వొడమ, నాతఁడు సహచరుండగు, గుణసాగరునితో. నాలోచించి తల్లిదండ్రులకుం జెప్పకయే నాటిరేయి మంత్రికుమారునితోఁగలసి దేశాంతర గతుండయ్యెను. అట్లా రాజకుమార మంత్రికుమారు లిరువురును, పాదచారులై చనిచని, తెల్లవారు నప్పటి కొకమహారణ్యమునందలి విశ్రాంతవటమూలమునకుం జేరిరి. ఆమహోన్నత వటభూజమునకు అంతము గానరాని దీర్ఘ శాఖలు రెండుమాత్రమే యుడెను. అందొకటి దక్షిణమునకును, రెండవది యుత్తరమునకునుఁ బోవుచుండెను. ఈశ్వర సృష్టియం దెన్నడుం గనివినని యా చిత్రముంగని, యాశాఖ లెంతదవ్వున కరుగునో గ్రహింపవలయునను బుద్ధివొడమ, నారాజకుమారుఁడు, గుణసాగరుంగని " తమ్ముడా! ఈ వటం బెంతయు విచిత్రముగ నున్నయది. దక్షిణశాఖను నేనును ఉత్తర శాఖను నీవును నారోహించి శాఖల యంతము గనుంగొనివత్తము. నాకత్తిని దాని యొరతో పాటుగ నీ చెట్టు తొరటలో నుంచెదను. ఒరకు త్రుప్పుపట్టిన నీకును, కత్తికిఁ ద్రుప్పుపట్టిన నాకును నపాయముగల్గినట్టూహింప నగును. తొలుతవచ్చినవారు. రెండవవారికై యీవ్రుక్షమూలమున వేచియుండునది "యని సాంకేతికం బేర్పరచి వెంటనే మంత్రికు మారు నుత్తరశాఖకంపి తాను దక్మిణశాఖం బట్టెను. రాజకుమారుఁ డా శాఖపై నెంతదూరము నడచినను,దానికొక యంతము గాన్పింపదయ్యెను. అందుల కాతఁడు మఱింత విస్మయమునొందుచు నెట్లయిన దానియంతు