పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

పండ్రెండు రాజుల కథలు


తనచేతనున్న కటారి తోడనే యాత్మహత్య గావించుకొని మరణించెను. ఈచిత్రమేమో యెఱుంగక భ్రాంతినందియున్న చారుదత్తుని రాజు క్షమింపఁ బ్రార్థించెను. అంత మాండవ్యుడు ప్రచండుని రాజునకుఁ బరిచితునిగావించి, జగన్మోహిని చారుదత్తుని పుత్రికయని యాకధనంతను దెలిపి, విపుల కంఠమునంగల ముక్తాహారముంగొని చని రాజకుమారుని బ్రదికించెను. అనంతరము జగన్మోహినీ జీమూతవాహనులకుఁ గల్యాణ మయ్యెను. చారుదత్తు మయూరవాహనులు వియ్యంకులైరి——మయూరవాహనుఁడు రాజ్యభారవహన విరక్తుఁడై పుత్రునకుఁ బట్టముగట్టి తాను పుణ్యకధా గోష్తి దినంబులు గడుపుచుండెను. అని శ్రీకృష్ణుం డర్జునున కెఱింగించెను.


తొమ్మిదవ నాటి రాత్రి కథ.

యథాప్రకారముగా కుంతీనందన యశోదానందను లిరువురును మఱుసటిదినమున, పెందలకడ భోజనాది నిత్యవిధుల యధోక్తముగ నిర్వర్తించి, యమునాసైకతభూముల కరుదెంచి మందమారుతసౌఖ్యము ననుభవించుతరి, గాండీవి గరుడధ్వజు నవలోకంచి——"యో పురుషోత్తమా! నీ దయారసంబున నిప్పటి కెనిమిది వేదాంతరహస్యంబులను కథారూపంబున నాకర్ణించి ధన్యుఁడనై తిని. తొమ్మిదవదియగు “అమనస్క” ప్రభావంబును నేడెఱిఁగింపవే! "యని ప్రార్థింప, నా గోపబాలుఁడు "సవ్యసాచీ! ఇందులకు విక్రమసేనమహా రాజు చరిత్రము నెఱిఁగింతు నాకర్ణింపు" మని పలికి యాతచ్చరిత్రము నిట్లు నిర్వచింపఁ దొడంగెను.