పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీల కేతనమహారాజు కథ

71


నిద్రాభంగమునంది యాకళానిలయ. సంగతినంతనువిని, తాను నీలకేతనుఁడగానని పలికి నిజచరిత్రము నెఱింగించెను. ఆచరిత్రము నానుపూర్వకముగ నాకర్ణించి — యక్ష రాజపుత్రికయగు కళానిలయ, తద్వ్యక్తి తన హృదయాధినాధుఁ డుగానందులకు విచారించియు, వధూనికాపరిచయ మయాచితముగగల్గుట కానందించి, సందర్భముల నెల్ల యోచించి, “ పాంచాల దేవీ ! ఇందుగల యక్షయువకులు నీ సౌందర్యముగాంచిరేని, మోహపరవశులై నిన్ను కడునిడుమలపాల్సేయక విడువరు; కావున నీవు స్త్రీరూపధారివిగాకుండ నీ పురుషాకృతితోడనే భవత్సోదరు డిందువచ్చుదనుక వేచియుండుము; నాతండ్రిపనుపున మఱికొందఱు చారులు నీసోదరు నన్వేషింప నరిగిరి. వారెట్లైన ననతి కాలంబుననే వారి నిందుగోని రాఁగల"రని హితంబువలుక, నామెవల్లేయని పలికి యక్షేశ్వరునిచే సన్మానింపఁబడి జామాతంబోలె సర్వసౌఖ్యములం గాంచుచుండెను.

ఇదియిట్లుండ, నారదమహర్షి యాశ్రమమునందున్న నీలకేతనుని యక్షదూతలు చిత్రపటసహాయంబునగుఱ్తించి నారదసందర్శనం బొనరించి యక్షేశ్వరు నిద్దేశంబు నాసంయమి కెఱింగించి, యానీల కేతనుని దమ వెంటనిడుకొని యక్షలోకంబునకరిగిరి, యక్షరాజు నీల కేతనునిగాంచి యాశ్చర్యపడి చారులపై గుపితుఁడై "ఓరిమందమతులారా! వీఁడె వ్వఁడో కపటవేషధారి, మీరు వీనిమాయాజాలములందగులుకొంటిరి. నాయల్లుడు నాయింటికి వచ్చి బహుదినంబులయ్యె; ఈకపటియెవ్వఁడో వీనిని కారాగారమున బంధింపుఁ" డని పలుక, నీలకేతనుఁడు తత్పరాభవంబు నోర్వఁజూలక, ప్రళయకాలరుద్రునిగతి మండిపడి, యక్షలోకమును భస్మీపటలంబుగావింప నుద్యమించుతరి, కళానిలయ సర్వోదంతము నాకర్ణిచి, సంభ్రమంబున నటకరుచెంచి యావత్కథను తండ్రి కెఱిఁగించి మున్ను జామాతగాన్నుది నీలకేతను సోదరియని తెలియజేసి, ప్రియుని కేల్వట్ట నాయక్షపతి పశ్చాత్తప్తుఁడై యల్లుని క్షమార్పణముం గోరి కళానిల యానీలకేతనుల కతివైభవంబున గల్యాణంబొనరించెను.