పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవనాటి రాత్రి కథ.

సప్తమదినంబునఁ గృష్ణార్జునులు యధాప్రకారంబుగ, యమునా తీరమున సుఖాసీనులై చల్లగావీతెంచు మెల్లనిపిల్ల తెమ్మెరల సౌఖ్యంబున కలరుచున్నతరి, నర్జునుఁ డచ్యుతుంగాంచి “యోపురుషో త్తమా! నిన్నటి దినంబున నీవు చెప్పిన, కామవర్ధనుని చరిత్రం బతివిచిత్రంబు; పరమానందభరితుండనైతిని. సప్తమంబగు, సాకారమహాత్మ్యంబు నెఱిఁగించి ధన్యునిగా వింపు"మని పలికిన, “పార్థా! సాకార ప్రబోధకంబగు నీలకేతన మహారాజు చరిత్రంబుగల దద్దాని నాకర్ణింపుమని యిట్లువచింప దొడంగెను.


నీలకేతన మహారాజు కథ.

తొల్లి పాంచాల దేశముం బరిపాలించుచుండిన సూర్యకేతనమహారాజునకు నీలకేతనుం డనునొక సుపుత్రుం డుద్భవిల్లెను. అంత నారాజు పుత్రోదయంబునకలరి దైవజ్ఞుల కాతనయుని జన్మపత్రికంజూప, నాయార్యులు గ్రహంబులను లెక్కించి “రాజా ఈ బాలుఁడు మిగుల దుష్ట కాలంబునం బ్రభవించె. వీనికి పదునాలుగేండ్లుమీరులోపల సూర్యరశ్మిసోకె నేని యనేక కష్టములంగాంచు"నని పలికిరి. సూర్య కేతనుఁడు దైవజ్ఞవచనానుసారంబుగ నాబాలుని నొక సూర్యరశ్మిసోకని పాతాళమందిరంబున నుంచి భద్రముగ గాపాడుచుండెను. ఆయనంతరంబున నారాజేంద్రునకు పాంచాలయను నొక తనయయు నుద్భవించే——ఇదియిట్లుండ దినక్రమంబున నా నీలకేతనునకు ద్వాదశ వర్షంబులునిండ నాకుమారుండు బాల్య చాపలంబున నొక రేయి యామందిరంబు వెల్వడి పురముంబాసి యొక మహారణ్యంబునంబడి చనుచు నిద్రావశంబున నొకశిలాతలంబున శయనించెను. దిన దినంబును భూతలంబునకు విహారార్థ మరుదెంచు యక్షపుత్రికయగు, కళానిలయ యనుసుందరి యాదినంబున నచటి కరుదెంచి, నీల కేతనుఁగాంచి మోహపరవశయై యాతని నెత్తుకొని