పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

పండ్రెండురాజుల కథలు.


హరిదత్తచక్రవర్తివని పల్కి నన్నీ రాజన్యుఁడు నిర్బంధించె. కాని తమ మిత్రుఁడు ననుఁగాంచి యీతఁడు హరిదత్తచక్రవర్తి కాడని పలికెను. నాటినుండియు నేనిందే యుంటిని ఇదియే నాచరిత్రం" బని పలుక హరిదత్తుఁడు (కామవర్ధనుఁడు) ప్రమోద బాష్పంబులు కన్ను లంగార సోదరాయని యాతని నాలింగనము చేసికొని సర్వవృత్తాంతము నాతని కెఱిగించెను. ఈ విధంబున నష్టపుత్రలాభంబునందిన తలిదండ్రులగు విపులా కీర్తివర్ధలు పుత్రులం గౌగిలించుకొని పరమేశ్వర ధ్యానంబు సలిపిరి. అంతట——హరిదత్తచక్రవర్తికిని జగదేక సుందరికిని, హరిదత్తసోదరుడగు కాంతివర్ధనునకును చారుదత్తకును కల్యాణంబులనువార్త సమస్తదేశంబులకుం బ్రాకిపోయెను. చిరకాలమునుండియు హరిదత్తచక్రవర్తిని దర్శింప నభిలషించుచున్న సమస్తదేశాధీశులును దేశీయజనంబులును నేలయీనిన చందంబున విదర్భాపురంబున కరుదెంచిరి? కామవర్ధనుఁడు కాళికాలయంబున దాచిన యశేషనిక్షేపంబు నర్థులకుం బరితృప్తికరంబుగ బంచి యిచ్చి, మహావైభవంబున సోదర ద్వితీయుండై కల్యాణంబొనరించు కొనుటయేకాక, విలాసిని నిచ్చి వసంతునకుఁ బెండిలిగావించి, తన్ను పెంచిన యాదవాధిపతియగు నా నందుని నవ్వను, బాల్యమిత్రులను నటకుఁ బిలువనంపి జగదానందకరుండయ్యెను. హరిదత్తుఁడే కామవర్ధనుండనియు రాజ్యం బన్యాక్రాంతంబైనదనియు నెఱిఁగిన సమస్తదేశాధీశ్వరులును, కాంభోజ దేశంబునకు దమ సైన్యంబులతో నరిగి శత్రురాజు పై దండెత్త—— నాతఁడు శరణాగతుండై రాజ్యంబునర్పించి తొలంగి చనియెను. ఈవిధంబున కామవర్ధనుండు, సోదరుఁడగు కాంతివర్ధనుని సహాయంబుననేకచ్ఛత్రంబున రాజ్యపాలనంబొనరించుచు, వృద్ధమాతాపితలకుం గన్నులచందమామయై యఖిల రాజమిత్రుఁడై——యాచక జనకల్ప భూరుహం బై పుత్ర పౌత్రాభివ్రుద్ధింగాంచి కాళికాక్రుపారసభాగ్యంబున బహుకాల మీభూతలంబున విలసిల్లెను.