పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

పండ్రెండురాజుల కథలు


టయేకాదా? నాతండ్రీ! సాహసించిచని నాకు పుత్రశోకముం గలిగింపకు” మని మఱి మఱి దుఃఖించి వారింపఁజూచినను, సుధాకరుండు సమ్మతింపక తల్లిని యుక్తివచనంబుల ననుమతింపంజేసి, నిరపాయంబుగ వచ్చెదనని పలికి యానాడే పయనంబై చనియెను. అంతనాసాధ్విచేయునది లేక కుమారుని మనఃపూర్వకంబుగఁ గౌగలించి చెక్కిలి ముద్దాడి, దీవించిపంపెను.

యువరాజగు సుధాకరుండు పులిపాలను సేకరించు నుద్యమంబున బయల్వెడలి, యొక మహారణ్యమునం జొచ్చి, యందుఁగల యాటవికులతోఁ దనవృత్తాంతముం జెప్ప వారు పకపక నవ్వి పరిహసించి, “యో వెఱ్ఱివాఁడా పులుల నెన్నింటినేని, భుజాసారము పెంపున బోకార్చినఁ బోకార్ప నలవి యగుంగాక——ప్రాణములతోడ, ఈనిన శార్దూలముంబట్టి, పాలు బితుక నెవ్వనితరంబు. నీకింతయేని తచాలకపోయెనా? ఏమని తలంచి యీ సాహసకార్యముం దలదాల్చివచ్చితివి. బ్రతుకఁ దలంపు గలదేని సత్వరంబున మజిలిపొమ్ము. నీకిది కరంబుగా ”దని పెద్దగా మందలించిరి. సుధాకరుం డాయెఱుకలనిరుత్సాహవచనంబులను వినియు వెనుదీయక, నలువురం దన వెంట తోడు దీసికొని, భయంకరారణ్యమునం బ్రవేశించి,యనేక శార్దూలంబుల ప్రాణములం బొరిగొనియెనే కాని, సజీవశార్దూలమును డాయునుద్యమంబుఫలింపదయ్యె—— అంత నారాజపుత్రుఁడు మిగుల నిరుత్సాహము జెందియే తదరణ్యంబున, నున్మత్తునిభాతి సంచరించుచు విధివశంబున, నాకానలోనున్న శరభృంగమహాముని యాత్రమముం బ్రవేశించి తన్మునిని దర్శించి, సాష్టాంగ దండ ప్రణామంబుల నాచరించి తనచరిత్రంబు నామూలచూడముగ నెఱిఁగింప నాసంయమి మందస్మితవదనారవిందుఁ డై యాతని నాదరించి దగ్గర గూర్చుండఁ బెట్టుకొని, "యోకుమారా! నీసవతితల్లి నీపై నీర్ష్య పెంపున నిట్టికపటో పాయముం బన్నెనేకాని పులిపాలు నిజముగా నెవ్వరికిని లభ్యములుగావు. నీ వీనిష్ఫల ప్రయత్నంబునుమాని కొన్ని నాళ్లు నాయాశ్రమంబుననుంటివేని, నీ కిహపర సుఖమార్గదర్శకంబగు సదుపదేశంబొనరించెద" నని