పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధాకరమహారాజు కథ

45


వేదవేదాంత విచారాదులయందును సద్గుణసహస్రమునందును, సాటి లేని శక్తిం గలిగి, వృద్ధినందుచు నెల్లరచేఁ గీర్తింపఁబడుచుండ——తద్యశోగాన శ్రవణంబును భరింపఁజాలక, సవతితల్లియగు విలాసవతి యేవిధానంబుననైన నాబాలుని నాశనముంగాంచ నభిలషించి, కొండొక రేయి, శిరోబాధను నటింపుచు, నమూల్య రత్నాభరణాంబరాదుల విసర్జించి కోపా గారముం జేరియుండెను. వృద్ధరాజు యధాప్రకారంబున నిజసతీ సదనంబున కరిగి యామె విచార కారణంబునారసి, 'యేవిధానంబున నీశిరోబాధ శమియించు' నని ప్రశ్నింప, నాహంత కారి కొంత దురంతదుఃఖంబు నభినయించి, “యోరాజా! ఇది సామాన్యమగు శిరోబాధ కాదు. ఇట్టి బాధ నాకు నాపుట్టింటసయితము బాల్యంబున నప్పుడప్పుడు కల్గుచుండెడిది. ఇందులకు శార్ధూలక్షీర మౌషధంబు; నీ పెద్దకుమారుఁ డగు సుధాకరుఁడు దానిని గొనిరాగల సమర్థుండు; మఱియొక మానిసి కది దుస్తరంబగును. వానినంపి నేఁ గోరినపులిపాలు తెప్పింతువా బ్రదుకుదు; లేదా——నేటితో మనఋణానుబంధ మంతంబగు " నని పలికి కపట దుఃఖంబు నటించెను. రాజునకు మనస్సు ద్రవింప, సుధాకరుంబిలిచి, “నాయనా! నీపినతల్లికి దుర్భర శిరోబాధ గల్గియున్నది. అందులకు పులిపా లౌఔషధంబట, దానిం గొనివచ్చుటకు నీవే సమర్ధుండవట! పులి పాలం దెచ్చి, నీతల్లి ప్రాణంబులను నిలుపుదువే తనయా!" యనియడుగ, నాపుత్రరత్నం బత్యంతవినయంబున వల్లేయని పలికి, నిజ జననితో తన ప్రయాణోదంతముం జెప్పెను. పిడుగడచినట్లు వినంబడిన పుత్రునివాక్యంబులకు కొంతవడిఱిచ్చవడి భారతి మహావిషాద చేతస్కయై: "కుమారా! ఇది మహాకపటోపాయము, నీసవతితల్లి నీమరణముంగోరి యిట్టి దురుపాయంబు నరసినది. రాజును చెంగున ముడివేసికొని మన కిట్టిదుర్దశను గలిగించుటతోఁ దృప్తినందక, నామహామారి మననాశనమును సయిత మపేక్షించుచున్నది. ఎచ్చటనైన శిరోబాధకు పులిపాలౌషధంబు లగునా? పులిపాలం దేదలంచుట మృత్యు దేతతా కరాళములం జోచ్చు