పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

పండ్రెండురాజుల కథలు


కాలమువచ్చియున్నది. ముందు వెనుకలాలోచింపక యౌవ్వనగర్వంబున, నరిగితివేని పరాభూతుండవగుదువు. కొన్ని దినంబులు శాంతింపు ”మని పలుకనాబాలవీరుండు కన్నీటిఁగరతలంబునఁదుడుచుకొనుచు “మహాత్మా! చేతులు కాలిన పిధవ నాకులతో పనియేమి? కొన్ని దినంబులు మీరానతిచ్చి, నట్లు శాంతింతునేని చిత్ర నాక్రూరుఁడు బలాత్కృతిఁ బరిణయం బాడును. కావున నన్నాటంక పరుపకుఁడని మరిమరి ప్రార్థింప, నాయతి, చేయునది లేక యాతని, నిండుమనంబున దీవించి యొక రక్షఁగట్టి, “బాలకా! ఈరక్ష యీజగన్నాధాలయ భక్తులచిహ్నము కావున నీకు రాజువలన ప్రాణభీతిగలుగదు. పోయిర 'మ్మని సెలవొసంగెను. ఈలోన క్రూరబాహువు చిత్రం దనయంతఃపురంబునకుఁ బిలిపించుకొని, యనర్ఘ్యమణి భూషణములతోడను, చీనిచీనాంబరములతోడను నామెను భ్రాంతనుగావించి వశపరుచుకొనఁదలంచుచుండెను. వీరుఁడు నిశీధికాలంబున ప్రబల రజ్జుసహాయంబున కుడ్యంబున కెగఁ బ్రాకి, చిత్రయుంపబడిన మందిరమునదూరి, యామెకు ధైర్యముంగఱపి, రహస్యముగ. రాజమందిరమునతిక్రమించి యరుగు వెఱవు నాలోచించుచుండు తరుణంబున నామందిరమును రక్షించు దాసీజనంబులు మేల్కాంచి, వీరునింగాంచి కల్లోలముగావింప రాజును నితరభటవర్గంబును తెలివినంది యావీరుని నిరోధింప నాతండు కయ్యంబునకుపక్రమించి యనేక భటులఁబిల్కు మార్చి, రాజమందిరము నందు రక్తపుటేరులం బ్రవహింపఁ జేసి విధిబలంబుతప్పుటచే నిర్బంధింపఁ బడియె. అంతఁగ్రూర బాహువాతని వధింప భటుల కాజ్ఞనొసంగ వివేకశాలియగు నాతనిమంత్రి తదుద్యమంబు నాటంకపఱచి రహస్యముగ రాజుంజీరి——నరేంద్రా! ఇతఁడు, జగన్నాథాలయ భక్తకోటిలోని వాఁడగుట నాతనిచేతంగలరక్ష సూచించుచున్నయది. కావున నీతఁడువధార్హుఁడుకాఁడు. కొండొరయుక్తింబన్ని, చిత్రావీరుల ప్రేమను భంగము చేయుదము. అంతటితో నీతుంటరి మనకడ్డమురాఁడు. తమనిజ సతీతిలకంబగు ధారుణీ దేవికి చిత్రధరించు పరిచ్ఛదంబుల ధరింపఁజేసి,