పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీన కేతు మహారాజు కథ

21


గూర్చుచేష్టల నేమేమియో కావించిపోయెను. ఇప్పుడు నీవడుగఁగా జ్ఞప్తికి వచ్చిన"దని చెప్పఁగా నావ్రుద్ధదాసి దరహసి తాననయై——"అమ్మక చెల్ల! ఇన్ని నాళ్లీ వార్తను నా కెఱింగింపక నీవేలఁదాచితివమ్మా ! వెఱ్ఱితల్లీ ! దుఃఖింపకుము. నీ కేమియుభయము లేదు; ఒకానొక దివ్యపురుషుఁడు స్వప్నంబున నీతో సంగమించెను. నీకు మహా తేజస్వియగు సుపుత్రుఁడు జన్మింపఁగలడు——నీకేవిచారము లే"దని యాశామృతముం బోయ నాబాలయప్పటికిఁ గొంతశాంతినందినను సహోదర వియోగమునకు నిరంతరము దుఃఖించుచుండునది. ఇట్లుండఁ గొన్నినాళ్లకనసూయ ప్రసవించి దివ్య కాంతులతోఁ దేజరిల్లు నొక సుపుత్రుంగనియెను. ఆబాలునకు దాసియే మీనకేతనుండను నామకరణం బొనరించి సాకుచు మాతసోకమును నివారింపం బాటుపడుచుండెను. క్రమంబున నీవార్త పురమం దెల్లవ్యాపించి బురజనుల నసూయను జారిణీనిఁగాఁ బరిగణించి బహిరంగముగ నిందించుచు, వ్రేళ్లుపెట్టి చూపసాగిరి. అనసూయ తద్దూషణంబులన్నింటిని, కుమారుని కొఱకై భరించుచు, నిజజనక నిక్షిప్తధనంబుతో నారేండ్ల కాలము గడిపెను.తదనంతరము భుక్తికి గూడ జఱుగక, ధారానగర నివాసంబు దుర్భరమగుటం జేసి, యట కతి దూరంబునంగల యుత్కళదేశంబునందలి కటకనగరంబునఁగల తన మాతామహుని గృహంబున కరుగ సంకల్పించి, దాసికి గృహంబునప్పగించి వేఁగుజామునంగుమారుని వెంటనిడుకొని ధారానగరముం బాసి చనదొడంగెను. ప్రకృతిసుకుమారులగు నమ్మాతాకుమారు లిరువుఱును, నత్యంత ప్రయాసంబున ననేకారణ్యంబుల నిర్గమించిచనుచు——కాళులు పొక్కు లెక్క——నాతపక్షుత్పిపాసల కోర్వంజాలక మార్గంబున నొక్క. విశాల వటచ్ఛాయను విశ్రమించిరి. అత్తరుణంబున, ననసూయ కత్యంత దుస్సహంబగు పిపాసయగుటయు, నయ్యను కుమారుందిలకించి, "నాయనా! దాహబాధచే నాప్రాణంబులు నిలుచునట్టులేదు. ఈ కాననంబున నెటనేని సరోవరంబొండుగలదేని యారసి తజలంబులం