పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

పండ్రెండురాజుల కధలు


దిలకించి, ప్రతాపసేనుఁడే జయసేనుని నఱకి పారిపోయెనని ఋతుధ్వజున కెఱింగించరి. మఱునాడు ఋతుధ్వజుఁడు, పేరోలగంబుండి, రక్తసిక్తాంగుఁడైన జయసేను నందురప్పించి గతరాత్రంబున నేమి ఘటిల్లెనని ప్రశ్నింప, నాతండు తానుద్దేశపూర్వకంబుగ, ప్రతాపసేనుని విడిచితిననియును తన్నిమిత్తమై విధింపఁబడనున్న యుఱి శిక్షకైన సంసిద్ధుండ ననియును వచించేను. ఋతుధ్వజుండదివిని విస్మితుండై జయసేనుఁడు తనకొనరించిన యుపకారములం దలంచి శిక్షింప బుద్ధి రామిం జేసి, నీవాతని నేలవదలితివి; ఎట్టి ఘోరంశిక్షకై న నేలఁ బాల్పడితివని యెన్ని విధంబుల నడిగినను మాఱువల్కఁడయ్యె. తుదకు విధి లేక రాజశాసన ప్రకారం బాతని కుఱిశిక్ష నాజ్ఞాపించెను. భటులు నిర్భయానంద చేతస్కుండై యున్న మణిమంతుం గొనిపోవ సంసిద్ధులై యున్న తరిఁ దత్సభామధ్యమునం దెటనుండియో——వికృతాకారుండగు నొక్క పురుషుండు వెడలివచ్చి, “రాజా! చాలు చాలు; నీ విశ్వాసబుద్ధి నేడుగదా తెలిసెను! నీకు నే కోవ కృతుల నొనర్చి విజయ సంపాదకుడై యున్న యీ బాలవీరునా నీవు వధించెద " వని గంభీరభాషణంబులం బలికెను. ఆ పురుషునిఁ బ్రతాపసేనునిగా నెఱింగి సభాసదులు వెఱఁగలది చూచుచుండ, నాతఁడు రాజా ! ఈ బాలు న్వెవ్వనిఁగాఁ దలంచితివి. ఇతఁడు నీ పూర్వమిత్రుండును, మగధ దేశా ధీశ్వరుండును నగు విజయసేనుని కుమారుండగు జయసేనుండు. నా కారణంబున రాష్ట్ర త్యాగియై యిట్లజ్జాత వాసంబోనర్పఁ బాల్పడియున్నాఁడు. ఈ కుమార శ్రేష్ఠుని, శ్రేష్టమానసంబు నెఱుంగక యజ్క్షానినై——చంపదలచి యీయెడకు సంగరమిషంబున నరుదెంచి మీచే బంధింపఁబడితిని. ఈ కుమారుండు నాయవమానముంగని యోర్వం జాలక, నన్ను విడిపింపఁ గారాగారంబున కరుదెంచి యందుసహితము నాచే క్షతగాత్రుఁడుగా నొనర్పఁబడియెను. ఇట్టి కుమారుం జంపఁ దలఁచిన పాపిని నేనింక జీవించినఁ బ్రయోజనము గలుగ " దని పలికి తనచేతనున్న కటారితోఁ