పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయసేన మహారాజు కథ

9


బేమియని ప్రశ్నించినవారల కెట్టి ప్రత్యుత్తరం బీయనేర్తును? జగద్రక్షకా! నాభావిజీవితము నీకృపారసముపై నాధారపడి యున్నయది. ఏరాజోత్తంసుని కడనైన నేవక వృత్తిని బ్రచ్ఛన్న కులగోత్ర నామధేయుండనై మెలంగనున్నాను. ఇదియ నాసంకల్పము. దానిని నెఱవేఱఁ జేయు భారమునీయదియే!" యని పరమేశ్వర ధ్యానంబు సేయుచు బహుతీరా రణ్యపర్వత నదీనదంబులను నిర్గమించి కట్టకడ కొక్క మహానగరముం బొడఁగాంచి పెన్నిధింగన్న పేదచందంబున, నానందించుచు, నప్పుఱభేదన, బహిఃప్రాంతంబునఁగల, భవానీ దేవ్యాలయముం జేరి తత్పరిసర సరోవరంబునఁ గడుపార జలంబులం గ్రోలి, ఫలవృక్షముల గాన్పించిన మధురఫలరసంబుల నారగించి క్షుత్సిపాసల నణంచుకొని, యాలయాంతరంబునకరిగి యద్దేవ దేవికిం బ్రదక్ష్మిణ నమస్కారాదుల నొనరించి మార్గశ్రాంతి నణంచుకొనఁగోరి, యాలయముఖమంటపంబున శయనించెను. కొండొకవడి కాతని శ్రవణపుటంబుల కాందోళికా గమన సూచకంబగు వాహకుల యోంకార నినాదంబు వినంబడుటయు, నించుక తలయెత్తి మార్గంబున వీక్షింప నల్లంత దూరంబున, వింశతిపరిచారికా పరివేష్టితంబగు నొక్క యాందోళిక, దేవాలయాభిముఖంబుగ నరుదెంచుట గాన్పించెను. అంత నయ్య వనీధవనందనుం డాత్మగతంబున, "సయ్యారే! ఈ యాందోళిక యీ దేవాలయంబునకే వచ్చుచున్నయది. పైఖరిం బరికింప నెన్వరో రాజకీయాంతః పురాంగనామణులు దేవీ పూజార్థమై యరు దెంచుచున్నట్లు తోఁచెడును. యువకుండ నగు నేనిందుగాన్పించుట కర్జంబుగాదు. ఇందెందేని దాగియుండెద!"నని తలంచి యందొక్క గుప్తప్రదేశంబుననిలచి యుండి, తదంగనామణుల వ్యవహారముం గమనించుచుండెను. ఏత దాందోళిక యాలయంబున కరుదెంచినపిదప, నప్పరిచారికలాందోళికాచ్ఛాదితంబగు రత్న ఖచితపటంబు నించుక తొలగించి "భర్తృదారీకా మణిమంజరీ! వెలికి రావచ్చునని పలుక, దేదీప్యమాన ప్రభాసౌందర్య విభాసురాంగియగు నొక్క