పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

పండ్రెండు రాజుల కథలు


యుండెను, శుభలగ్న సమయంబున చేటికాద్వితీయయై భువి నవతరించిన, రతీసతివలెను——నిష్కళంక శశిబింబంబు వడువునను, అచంచల విద్యుద్వల్లికరీతిని, రాజపుత్రుల కన్నులు మిఱుమిట్లు గమ్మ——ననంగసేన సభామధ్యంబున కరుదెంచి, తన సఖివర్ణించుచుండిన, తత్తద్రాజపుత్ర కుల చరిత్రంబుల నాలకించియు——నసమ్మతిం జూపుచు, తన మనోహరుండటం గాన్పింపమి, దిగులు చెంది——విగ్రహరూపంబున నున్న రాజశేఖరరూపముం దిలకించి, మహాప్రమోద పులకితాంగయై—— తద్విగ్రహ కంఠ భాగముం బుష్పమాలికచే నలంకరించెను. ఆ విపరీత కార్యముంగని, యనంగసేనుఁ డాగ్రహించె——రాజపుత్రకు లెల్లరుం దమ్ము నేపాళ, భూపాలుఁ డవమానించెనని కత్తులు దూసిరి. ఎట్టకేలకా రాజు సమస్త రాజులఁ బ్రార్థించి శాంతచిత్తులం జేసి, తన పుత్రిక యొనరించిన యవివేక కార్యంబున కేమిసేయుటకుం దోపక, ఆ యబలను ప్రబల నిర్బంధమున నుంచెను. ఇట వ్రుత్తాంత మిట్లుండ, నటరాజశేఖరుఁడు మార్గశ్రాంతిచే, స్వయంవర దినమునకు చేరఁబాలక, జఱిగిన విషాద వార్తాదికములను మార్గమధ్యమునందే యాకర్ణించి, విరక్తుఁడై మరల నొక యరణ్యంబునఁ బడి, యెట్టకేలకు, వసిష్ఠమహాముని యాశ్రమమునం బ్రవేశించి యా ఋషి పుంగవునకు నమస్కరించి, తన వృత్తాంత మాసాంతముగ విన్నవించి తన కొద్దియేని తరణోపాయము నెఱిఁగింపుమని, ప్రార్థించెను. అంత నా ఋషిచంద్రఁ డాతని నాదరించి ప్రీతితో నాసీనుం జేసి, "రాజపుత్రా! మహాయోగిసత్తముల కలభ్యమగు ఎఱుక ప్రభావంబున నీవు తరింపఁగలవు! దాని నాకర్ణింపుమని, తత్ప్రభావం బెల్ల నెఱిఁగించెను.

రాజశేఖరుఁ డెణుక ప్రభావమున దివ్యజ్ఞానముం దెలిసినవాఁడై యా మునీంద్రు నుపచరించుచుఁ గొన్ని దినంబులందే యుండెను. ఒక దినమున రాజశేఖరుండు నదీతీరంబునకరిగి జపతప సంధాద్యనుష్ఠానాదులం దీర్చుకొని గురు దర్శనంబునకు పర్ణశాలకు వచ్చుసరికి, జపపర తంత్రుఁడై యున్న గురుని సమీపంబున పదునాఱేండ్ల ప్రాయముగల,