పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరమహారాజు కథ.

97


జూచిన నీ వింక నెంతగా స్తుతించుచుంటివో——దానికి సతియు రతియు భారతియు నీడుగారని" పలుక, నావిషయంబున నారద తుంబురులకు పెద్దవాదము జఱిగెను. తుదకు వారా యనంగసేనా రాజశేఖరుల నొక్కచోఁజేర్చి యందమున నధికులెవ్వరో నిర్ణయింతమని యట్లుస్థిర పఱచుకొనిరి. ఆరాత్రి రాజశేఖరుఁడు నిద్రించుచుండ మచ్చుమందు జల్లి యాతని నభోతలంబునఁ గొనిపోయి—— నిద్రాముద్రితయైయున్న యనంగసేన శయ్యపైఁ బరుండఁ బెట్టిరి. కొంతరాత్రి కయ్యనంగసేన, నిద్రమేల్కని తనప్రక్క నొక మన్మధ ప్రతిమానుఁడగు రాజపుత్రుఁ డుంటకక్కజమంది, తన వ్రేలియుంగరము నతనికిడి, యతని వ్రేలి యుంగరముం దనచేత ధరించి యంతలో నారద తుంబురులు కల్పించిన నిద్రచే మైమఱచెను. తరువాత, రాజశేఖరుఁడు మేల్కని, యాసతి యెవ్వరో యెఱుంగక మోహపరవశుఁడై ముద్దిడుకొనుచుండగనే నారద తుంబురులాతనికి నిద్రంగల్పించి కాశ్మీర రాజాంతఃపురమున నతని శయ్యంజేర్చి రాజపుత్రిక యధిక సౌందర్యవతియని నారదుఁడును రాజపుత్రుఁడధిక సౌందర్యవంతుఁడని తుంబురుఁడుసు వాదించుకొనుచుఁ దమతమ మార్గములం బోయిరి. ఉదయమున లేచి రాజకుమారుఁడు గతరాత్రి తాను గాంచిన దెల్ల నొక కలయని భావించి వ్రేలికిం దన ముద్రాంగుళీయము లేకుండుటయు, నా రాజపుత్రిక నామాక్షరములుగల రత్నాంగుళీయక ముండుటయుం గాంచి పరమవిస్మయ పరీతస్వాంతుఁడై యావృత్తాంత మెల్లఁ దన సోదరియగు రాజముఖికింజెప్ప, తొలుత నామెయువిశ్వసింపక,యంగుళీయముం గాంచి తుదకు నమ్మెను.

ఆక్షణము మొదలు రాజకుమారుఁడతి బేలతనంబున వాపోవుచు, నాయనంగసేన సంగతిం గననినాడు—— ముక్తజీవి నయ్యెదనని పలుకఁ జొచ్చెను. ఆయనంగసేన యేదేశపు రాజపుత్రికయో ఎందుండునో యెఱుంగక రాజముఖి——యీవార్త రాజేంద్రున కెఱిcగించెను. దిలీప భూపతియు——బహుకాలమునకు, నిజనందనుని మానసము, కల్యాణ