పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రతుకు టెడారిలో నిసుకబాటలఁ ద్రిమ్మరి నీరువట్టి దుః
స్థితి మరణింపనున్న యొక జీవి కదృష్టపువాఁగువోలె సం
తతముఁ ద్వదీయ దివ్య కవితారస నిర్ఝరిణీ ప్రపాత మ
ద్భుతముగ చిత్తతాపమును బోనడచు\న్‌ శిశిరాంబుసేచన\న్‌.

తెలుఁగుందోఁటలఁ బచ్చబీళ్ళ ననురక్తిం బానశాలాప్రతి
ష్ఠలు గావించి త్వదీయకావ్యరసభాండంబుల్‌ గులాబీలు బు
ల్బులిపిట్టల్‌ మధుపానపాత్రికలు సొంపుల్‌ గుల్కు సాఖీయు భూ
తలనాకం బొనరింప నిల్పి రసికాంధ్రప్రీతి గావించితి\న్‌.

పారసికన్న శ్రావ్యమయి పల్లవకోమలమై సుధారసం
బూరెడు మా తెనుంగునుడి నొప్పిదమౌనటు నీదు భావముల్‌
ఏరిచి చేర్చికూరిచితి నింపగుకావ్యము నోఖయామ, నీ
పేరిఁక యావదాంధ్రపృథివీస్థలి శాశ్వతమై తనర్చుత\న్‌!

అలరెడు నాణిముత్యముల యాశ్రయగౌరవ మొందిసూత్రముల్‌
గులుకుమిటారి జవ్వనపు గుబ్బల నాట్యములాడుఁ గాదె యే
కలిమియు లేకయుండియును, ఖయ్యమ, నీ మృదుముగ్ధభావమం
జులత సమాశ్రయించు కృతి సొంపిలదే రసికార్చనీయమై.