పుట:Palle-Padaalu-1928.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చందమామకోపు

——మన జాతీయజీవనంలో యువకులకునూ తరుణవయస్కులకునూ ఆటలు లేవు. కోలాట మొక్కటి కాబోలు ఆట అనటానికి వీలయినది. దీనిలో వర్ణచలనమూ వేషసామరస్యమూ, గమన సామరస్యమూ, మువ్వల మ్రోత కోలల లయ, రాగసరళీ, కంశమేళ, కధాసౌందర్యమూ ఒక్కుమ్మడిగా ఏకమయి అలరిస్తవి. జట్టు నాయకుడు ఒక చరణము పాడితే వస్తులాకారంలో ఉన్న జట్టువారు ఆచరణాన్ని తిరిగి పాడతారు. ఆందరూ చిన్న చిన్న కట్టెలతో లయను సూచిస్తునే పాడతారు. నాయకుడు నడిపే కధలో ఉత్సాహపు పట్టువచ్చినప్పుడు, ముందుకూ వెనుకకూ అడుగులు వేయటమూ, పక్కవానిని చుట్టిపోయి పైవానితో కోలకొట్టి తాళము నిలపటమూ, ఆట గాండ్రు చాలమంది దొరికితే లోకక్ష్య నెలికక్ష సవ్యము గానూ ఆపసవ్యము గానూ తిరగటమూ కనబడతాయి.


కోలాటపు పాటలు సామాన్యముగా చతురశ్రగతిలో కిటతక కిటతక అనో త్రిశ్రగతిలో తకిట తకిట ఆనో వడుస్తవి. వీటిని కోపులంటారు. మొకటిది విఘ్నేశ్వర కోపు. " శివశివమూర్తివి గణనాన, నీవు, శివుని కుమారుడవు గణనాడ” అని ప్రారంభిస్తుంది. సరసకోపు అనే "గొల్ల వారి వాడలకు కృష్ణ మూరితీ, నీవు, ఏమి పనికొచ్చినావు కృష్ణమూరితి " అన్న పాట అన్నమయ్య గారి కాలానికే ఉన్నట్లు దీన్ని అనుసరించిన ఆతని సంకీర్తనలు 'పెక్కులు సాక్ష మిస్తవి . . . కోలాట కీర్తనలు దేశి సారస్వతములోని ఒక ప్రత్యేక అధ్యాయము. పురాణగాధా సన్ని వేశాలూ, భక్తుల తీర్థయాత్రలూ, గోవాళ్ల సంవాదాలూ, 'వేదాంత తత్వాలూ, బ్రతుకు బాటలూ, గురుప్రశంసలూ, మోహప్రలాపాలూ, అన్నీ వుంటవి ఈ పాటలలో. తెలుగులో ప్రాస్తావిక పద్యమంజరులు (Poems) లేవు: ఈ కోపులు ఆ సీట్లలో చక్కగా అమిరి పోతవి . . . మనము కీర్తన అనుకునే “రామలాలీ మేఘశ్యామలాలీ, తామరసనయన దశరథతనయాలాలీ” అన్నది లాలికోపు, 'తెల్లవారవచ్చె తొలికోడి కూసెను నల్లాని నాసామిలేరా అన్నది మేలుకొలుపు కోపు. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం ' అన్నది మంగళహారతి కోపు. పూర్వకాలపు పాటలలో ఈ కోపులు కలిసిపోయి ఉంటవి. దరువు, కోఫు,

56