పుట:Palle-Padaalu-1928.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విసురురాతి పదములు-1

——విసురురాతి పదములని పశ్చిమాంధ్ర సీమలో చాలా పదములున్నవి. విసురురాతికి శృతితోనే గాని తాళముతో సంబంధము లేదు. కనుక ఈ పాటలలో తాళపు బిగుతువుండదు. ఊహలూ భావాలూ మాత్రమే పొడుగు వెలరని పట్టుకుంటాయి. కధనము కనబడుతుంది వీటిలో ముఖ్యంగా, మచ్చుకు నాలుగు పాటలు,


ఆదివారమునాడు అమావాస్యనాడు
అన్నయింటికీ నేను గిన్నె నడుగబోతే
మావదిన శాంభవి లేదుపొమ్మనెను
మాయన్న మంచివాడు మళ్లి రమ్మనెను
చిన్నోనికి చీటంగి సిలుకు కుళ్ళాయి
బాలునికి పొట్లంగి పాలుపొసెగిన్నె
నాకునల్లచీర నెమలివన్నె రవికె
వడినిండ బియ్యము వళ్ళో కొబ్బరిగిన్నె
పసుపుకుంకుమయిచ్చి పంపెమాయన్న ౹౹

39