పుట:Palle-Padaalu-1928.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బైరాగీ

——చివ్వర ఘటాకాశ ప్రశంస ఉన్నప్పటికీ ఇది నీతి, శమదమాది గుణసంపత్తీ బోధించే పాటయే.

నాదబ్రహ్మానంద యోగీ వీడు
వేదాంతసారము వినిచే బై రాగి
రాజసంబు దుఃఖదమురా, ఘన
రాజయోగమార్గమే సౌఖ్యదమురా ౹౹నాద౹౹
చిత్త శుద్ధి గల్గియుండు, భక్తి
జేరిసద్గురు నీవు సేవించుచుండు ౹౹నాద౹౹
మత్తత్వము లేకయుండు, స
మస్తమింద్రజాలమంచూరకుండూ ౹౹నాద౹౹
పెద్దల నిందించవలదూ, ఒరులు
పీడించినా నీవు భీతిల్ల వలదూ ౹౹నాద౹౹
వనిత లేకున్న దుఃఖమురా, కాని
వనితగల్లెనేని వగవదుఃఖమురా ౹౹నాద౹౹
ధనము లేకున్న దుఃఖమురా, చాల
ధనము గల్గెనేని దాచదుఃఖమురా ౹౹నాద౹౹
పచ్చికుండ వంటి మేను, ఇది
చచ్చుగాక ఆత్మ చావ దెన్నడును ౹౹నాద౹౹
విచ్చికుండ వ్రక్కలైనా, లోన
హెచ్చియున్న బయలు విచ్చి రెండౌన ౹౹నాద౹౹