పుట:Palle-Padaalu-1928.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూనలమ్మ పదాలు

——కూనలమ్మ పాట ఒకటే నీతికి సంబంధించిన పాట. కూనలమ్మ పార్వతీదేవి కూతుళ్లు కామేశ్వరీ దేవికి తోబుట్టువులూ అయిన ఆక్కలకు కాపగు పోతురాజునకు భార్య. కూనలమ్మ సంకీర్తనములు, కూనలమ్మ చీర, కూనలమ్మకు వేట, కావ్యాలలోనున్నూ పాటలలో నున్నూ వినబడుతునే ఉంటవి. ఈ 'పదము ' తక్కిన పదకావ్యములవలె జంపెవరుసలో నడుస్తున్నది. చరణములన్నీ దొరికిన బాగుండియుండును.

అన్నమిచ్చిన వాని | నాలినిచ్చినవాని
నపహసించుట, హాని ! ఓకూనలమ్మా !
ఆడి తప్పినవాని | నాలి నేలనివాని
నాదరించుట హాని | ఓకూనలమ్మా !
భీష్ముఁడనుభవశాలి | భీముఁడే బలశాలి
కర్ణుఁడే గుణశాలి | ఓకూనలమ్మా !
దుర్యోధనుఁడు భోగి | ధర్మరాజొక జోగి
అర్జునుండే యోగి ! ఓకూనలమ్మా!
కవితారసపుజల్లు | ఖడ్గాల గలగల్లు
కరణాలకే చెల్లు | ఓకూనలమ్మా!
కాపువాఁడే రెడ్డి | గరికపోచేగడ్డి
కానకుంటే గ్రుడ్డి ! ఓకూనలమ్మా !
మగని మాటకు, మాటి | కెదురుబల్కెడిబోటి
మృత్యు దేవత సాటి | ఓకూనలమ్మా!
జపతపంబుల కన్న | చదువుసాములకన్న
ఉపకారమే మిన్న | ఓకూనలమ్మా !