పుట:Palle-Padaalu-1928.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్నెగోర - చిన్నచిల్క

——సంఘములో నుంచి దాటిపోయి ఏతోటలోనో కోమ్మల మీద ఊగుతూ పాడుకుంటున్నారు ప్రేయసీ ప్రియులు.

మొవ్వాకు చీర పెడతా : మొగలి రేకులు పెడతా;
నన్నూ పెళ్లాడ్తావా ? కన్నెగోరా ? ౹౹మో౹౹
ముద్దూటుంగరము బెట్టి | ముత్యాల పేరుగట్టి
నిన్నే పెళ్లాడతాను : చిన్న చిల్కా ! ౹౹ము౹౹
ఉల్లీ పిల్లేళ్లు చేస్తా ! 'మొల్లా తలంబ్రాలుపోస్తా
నన్నూ పెళ్లాడతావ ! కన్నెగోరా ! ౹౹ఉ౹౹
పసుపూ పాదాలు కడిగి ! పచ్చాటంగీతొడిగి
నిన్నే పెళ్లాడతాను | చిన్న చిల్కా, ౹౹ప౹౹
గచ్చాగజ్జియలు పెడతా | పచ్చాకు తాళిగడతా |
నన్నూ పెళ్లాడతావా ? కన్నెగోరా ౹౹గ౹౹
మణుల దీపాలు తెచ్చి | మంగళహారతులిచ్చి,
నిన్నే పెళ్లాడతాను | చిన్న చిల్కా ౹౹మ౹౹

గోరవంక అనగా ఆడు చిలక అన్న అర్ధము చేసినాడు ప్రాకృత రచయిత,