పుట:Palle-Padaalu-1928.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోంగూరకి

——దీనికి మాయదారికుర్రవాడు వలపన్నినాడు. పట్టుబడ్డది. ఈ పాటలోనిది కొట్టుకొనుట మాత్రము కాదు. వంటికీ మనసుకీ మల్లయుద్ధము.

ఎందుకోననుకొంటి గోంగూరకి —— అమ్మ
ఎందుకోననుకొంటి గోంగూరకి
పుట్టెక్కి సూశాడు గోంగూరకి ——వాడు
చెట్టెక్కి సూశాడు గోంగూరకి ఎందుకో
చేట్టుదిగి నవ్వాడు గోంగూరికి——వాడు
పట్టుపట్టమన్నాడు గోంగూరకి ఎందుకో
ఎత్తు ఎత్త మన్నాడు గోంగూరకి——వాడు
మోవెత్త మన్నాడు గోంగూరకి ఎందుకో
చేయిపట్టుకొన్నాడు గోంగూరకి——వాడు
చెక్కిలిని పుణి కేడు గోంగూరకి ఎందుకో
కళ్ళల్లోకి చూశాడు గోంగూరకి—— అమ్మ
ఒళ్ళు పులకరించింది గోంగూరకి ఎందుకో

ఈ వరసలో వల్లూరి జగన్నాధరావు గారు ఒక పాట రచించినారు. ఈచరణములు ఆందులోనివా అని అనుమానము కలుగుతుంది. కాని మాటలేవిన్నీ తప్ప పడినట్లు లేవు. 'గోంగూరకి ఆన్నది పాదాంత పదమే.