పుట:Palle-Padaalu-1928.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలపుకాని చావు విని

——ఈ చిన్నది కూడ వలపు ఒక చోట వళ్లు వేరోకచోట ఉన్న దురదృష్టవంతురాలే. పాపము ఈమె తన వలపుకాడు మరణించిన వార్త విన్నది. ఎట్లేడ్వ గలదు ? ఆనాడే అత్తింట ఒక దూడ కూడ చచ్చిపోయినది. ఆ దుఃఖమును దూడ పేరిట వెళ్లగ్రక్కుకొని గుండె బరువు దింపుకొను చున్నది.

దూడమ్మ దూడా దూడా దూడంటే దుఃఖ మొచ్చె
వాడంతా వాడిపోయే కూడైన తినిపోయె దూడమ్మ
బూరెలు వండినాను బుట్టలో పెట్టినాను
బూరైన తినిపోయె దూడమ్మ దూడా దూడా
గారేలు వండినాను గంపాలో పెట్టినాను
గారైన తినిపోయే దూడమ్మ దూడా దూడా
గుగ్గిళ్లు వండినాను గుడిసెల్లో పెట్టినాను
గుగ్గిళ్లు తినిపోవె దూడమ్మ దూడాదూడా
మంచి నీళ్ల బావి కాడ మంచి మంచి గంతులేసి
మంద మోరమలగూకోయె దూడమ్మ దూడా దూడా
వరిచేలలోకి పోయి వచ్చిపోయే వారిమీద
వన్నెచూపులైనచూడు దూడమ్మ దూడా దూడా
ఎన్నెన్నొ దూడలున్నాయి ఎన్నెన్నొవాడలున్నాయి
నావాడా దూడానీ వే దూడమ్మ దూడా దూడా

ఇంకొకతెకు పరిస్థితువింత పదునుగా లేవు. గుండెలు బాదుకుని ఏడుస్తున్నది:

గుండెలుగాడి తమ్ముడంట
మందపాటి కోటడంట
మారెళ్ల నుబ్బడంట
మందు పెట్టి సంపెరోరబ్బో గుండేలుగా
ఆరబ్బో అబ్బో అరబ్బో గుండేలుగా !