పుట:Palle-Padaalu-1928.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంతో బీదవాడే

——ఆలోగిలిలో ఏదో పాట వినబడుతున్నది. నడవండి త్వరగా. ఓహో, సాతాని జియ్యరులు, వెడల్పైన ఏర్రంచుల తెల్లధోవతులు, వంటి నిండా నామాలూ, తలపైనముసుగు నుదుటి చుట్టూ తిప్పినకొంగూ, చేతిలో తాటియాకు విసనకఱ్ఱ, తలమీద గుమ్మిడిపండువంటి రాగిపాత్ర ! చూడవలసిన వేషము ! ఆదిగో తిరిగి అదేపాట పాడుతున్నారు. రండి విందాము.

ఎంతో బీదవాడే వేణుగోపాలుడు ఎంతో పేదవాడే
ఎంతో పేదగాకుంటే అలనాడు కుచేలుని
అటుకులకు చెయిజాచునా ౹౹వేణుగోపాలుడు౹౹
కట్టవస్త్రమె యుంటె కౌసల్య తనయుడు
నార చీరెలు దాల్చునా ౹౹వేణుగోపాలుడు౹౹
ఎక్క గుఱ్ఱమె యుంటె యశోదతనయుడు
పక్షివాహన మెక్కునా ౹౹వేణుగోపాలుడు౹౹
పండమంచమె యుంటె పంకజనాభుడు
పాముపై పవళించునా ౹౹వేణుగోపాలుడు౹౹
ఉండయిల్లే యుంటే పుండరీకాక్షుడు
కొండ నెతుక దూరునా ౹౹వేణుగోపాలుడు౹౹
క్షీరసంద్రమేయుంటే శౌరి పొరుగిండ్లకు
పోయిపాలు త్రాగునా ౹౹వేణుగోపాలుడు౹౹

చమత్కారంగా వున్న దిగదూ. అదుగో ఆయింటివారేమో అంటున్నారు. పాడవలసిన జియ్యరులు వింటున్నారు మనముకూడా విందాము.

128