పుట:Palle-Padaalu-1928.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 ఏరువాకమ్మ

—వానలుకురిసి పొలము పదునెక్కగనే దుక్కిటెద్దులను పూన్చి రైతు ఏరువాకను సాగిస్తాడు. ఏరువాక! ఎంతముద్దైనపాట. మన జీవనములకు జీవము ఏరువాక. ఎడ్లకు పసుపు కుంకుమలు పూసి, ఏరును పూలమాలలతో నలంకరించి ఏరువాకకు మంచి ముహూర్తమున పూజలు చేస్తారు. సహృదయులు కర్షకులు

 ఏరువాకమ్మకి యేమి కావాలి
ఎర్రఎర్రని పూలమాల కావాలి
ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి
ఏరువాకమ్మకి ఏమి కావాలి?
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి
ముత్తైదు లందరూ పాటపాడాలి
పాటపాడుతు తల్లిపాదాలు మొక్కాలి
ఏరువాకమ్మనూ ఏమికోరాలి
ఎడతెగని సిరులివ్వ వేడుకోవాలి
పాడి పంటలుకోరి పరవశించాలి.

ఎర్రఎర్రని పూలమాలలు ఊగుతుండగా, పసుపు టెరుపులు ఎడ్ల శరీరములమీద అందపుటలలు తీర్చుతుండగా, ఎరుపు తెలుపులమబ్బు టెండలో ముతైదుల పాటల ఉత్సాహములో జరయు మృతియులేని ఏరువాకకు మరియొక పుట్టిన దినము జరుగుతుంది.

2