పుట:Palle-Padaalu-1928.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెర్రి మగడు

——పెంకి పెండ్లాము శ్హ్లేషార్ధమును పట్టి పెనిమిటిని యెగతాళి చేస్తున్నది. ఈ గేయము పశ్చిమ గోదావరి మండలానిది.

ర్యాలీ రావులపాడు "రేలంగి సంతలోన
వోచ్చెపరిగె తెచ్చినానె ముక్కెయ్యవేపిల్ల ముక్కెయ్యవే

ఓరోరి నామగడ వయ్యారి నామగడ
ఎర్రిబాగుల నామగడ ఎబ్రాసి నామగడ
రెక్కలున్న సేపకీ ముక్కులుంటాయా?

నరసాపురం పాలకొల్లు మారుటేరు సంతలోన
కోడి పెట్ట తెచ్చినానె గుడ్డెయ్యవేపిల్ల గుద్దెయ్యవే

ఓరోరి నామగడ ఒయ్యారి నామగడ
ఎర్రిబాగుల నామగడ ఏబ్రాసి నామగడ
జుట్టున్న కోడికి గుడ్డుంటదా?

భీమవరం ఆకీడు ఈరవాసరం సంతలోన
గేదె పెయ్య తెచ్చినానే పాలెయ్యవే పిల్ల పెరుగెయ్యవే

ఓరోరి నామగడ ఒయ్యారి నామగడ
ఎర్రిబాగుల నామగడ ఏబ్రాసి నామగడ
కొమ్ములున్న గేదెకూ పెరుగుంటదా పాలుంటయా ?

100