పుట:Palle-Padaalu-1928.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓరందకాడ

——జానపదులలో మామను పెండ్లాడుట కలదు. పలు అవతారములతో ప్రత్యక్షమయ్యే ఈ పాట 'దేశ మెల్లిన ' మామ నుద్దేశించి అతని ప్రేయసి పాడిన పాట.

ఓ——రందకాడ బంగారు మామ
చంద్రగిరి చీరలంపరా |
చంద్రగిరి చీరలంపూ కాకినాడా గాజులంపు
రాజమంద్రీ రైక లంపుమురా ౹౹ఓరందకాడ౹౹
నీకు నాకూ దూరమాయె నీలికొండలడ్డమాయె
కోడకెక్కీ గోఱ్ఱె మేసిందోయి ౹౹ఓరందకాడ౹౹
నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి నిమ్మపళ్ళూ కొయ్యబోతే
నిమ్మముళ్లూ రొమ్ము నాటెనోయి ౹౹ఓరందకాడ౹౹
నీకు నాకూ దూరమాయె నల్ల కొండ లడ్డమాయె
సల్లగున్న సాలునంటిరా ౹౹ఓరందకాడ౹౹
నందియాల సందుల్లోన ధర్మలారుదారుల్లోన
కాలుజారితే కదలనివ్వరురా ౹౹ఓరందకాడ౹౹
దచ్చినాన గాలితోనే వచ్చే నల్లమబ్బుతోను
వన్నె వన్నె వార్త లంపుమురా ౹౹ఓరందకాడ౹౹

ఇది ఏలపాట, తాళ్లపాక చినతిరుమలాచార్యులు దీని లక్షణముసు సంకీర్తన లక్షణములో వ్రాసెను గాని అది కేవలము దీని రూపవర్ణనమును మాత్రమే చేయుచున్నది. దీని గతి 'తకకిటతక ' అని ఆరక్షరాల ఆవృతాలు నాలుగు చొప్పున గల రెండేసి పాదాలతో నడుస్తున్నది. రెండో పాదములో చివరి రెండావృతాలకున్నూ “రా,ఓ” అన్న రెండక్షరాలే వాహనాలు.

95